రెచ్చిపోతున్న ‘‘మైనింగ్’’ మాఫియా.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో గుట్టలు మాయం!
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా చెలరేగుతోంది. అధికారులు ‘అందినంత’ సహాయం చేస్తుండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డూఅదుపూ లేకుండా యథేచ్ఛగా మట్టి తోలకాలు జరుగుతున్నా.. మైనింగ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఈ దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీల వలే స్పీడందుకుంది. గుట్టలు కరుగుతున్నా, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది. తాజాగా ఓ ప్రజాప్రతినిధి దృష్టికి ఈ విషయం రావడంతో అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది.
దిశ బ్యూరో, ఖమ్మం: మట్టి తోలకాలు యథేచ్ఛగా చేస్తూ అక్రమార్కులు చెలరేగుతున్నారు. లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ దందా జరుగుతున్నా.. మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. పెద్ద పెద్ద గుట్టలు కరిగిపోతున్నా.. అధికారుల కళ్ల ఎదుటే పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు మట్టి తరలించుకుని పోతున్నా పట్టించుకునేవారు లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.
రఘునాథపాలెం, ఖమ్మం రూరల్లో..
రోజురోజుకూ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భూములకు విపరీతంగా ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. అదేస్థాయిలో వెంచర్లు వెలుస్తున్నాయి. కొన్ని వెంచర్లు అన్ని అనుమతులతో విక్రయాలు జరుపుతుండగా.. కొన్ని వెంచర్లు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం కాగితాలకే పరిమితమై విక్రయాలు జరుపుతున్నాయి. వాస్తవానికి టెంపరరీ లే అవుట్ పర్మిషన్ (టీఎల్‌పీ) ఉంటేనే వెంచర్‌ను చదును చేసి, ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టాలి. కానీ వెంచర్ల నిర్వాహకులు అవన్నీ పట్టించుకోకుండా భూమిని చదును చేస్తూ విక్రయాలకు పెట్టేస్తున్నారు.
ఈ క్రమంలోనే భూమిని లెవెల్ చేసే క్రమంలో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. గుట్టలను తొలుస్తూ వందలాది ట్రాక్టర్లతో కావాల్సినంత మట్టిని అనుమతులు లేని వెంచర్లలో నింపేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అయితే ఈ విషయం అంతా మైనింగ్ అధికారులకు తెలిసే జరుగుతుందని, వారికి అందాల్సిన ముడుపులు అందాకే తొలకాలు ప్రారంభం అవుతాయని అక్రమంగా మట్టి తరలిస్తున్న ఓ లారీ యజమాని ‘దిశ’ కు తెలిపాడు.
గుట్టలు మాయం అవుతున్నా..
ట్రాక్టర్, లేదా లారీ మట్టి తోలాలన్న మైనింగ్ అధికారుల అనుమతి తీసుకుని తరలించాల్సి ఉంటుంది. అయితే గుట్టలు కరిగిపోతున్నా ఆ అధికారుల్లో మాత్రం చలనం లేదు. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఇలాంటి గుట్టలు గుట్టుగా కరిగిపోతున్నా.. పదుల సంఖ్యలో ప్రొక్లయిన్లు పెట్టి లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకపోవడం విశేషం.
రఘునాథపాలెం మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ దందా విపరీతంగా సాగుతున్నా, అధికార పార్టీకి చెందిన కొందరి హస్తమున్నా ఎవరూ నోరు మెదపకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది. ఖమ్మం రూరల్ మండలంలో వెలిసిన వెంచర్లకు సైతం యథేచ్చగా మట్టి తోలకాలు సాగుతున్నా అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవు. లారీకి ఒక రేటు, ట్రాక్టర్ కు ఒక రేటు అంటూ అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతోనే ఈ విషయమై ఎవరూ దృష్టి సారించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
అనుమతులు పొందినా.. అక్రమంగానే
ఇందులో ఇంకో ట్విస్టు కూడా చోటు చేసుకుంది. అనుమతి పొంది తవ్వకాలు ప్రారంభించిన వారు కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతులు కొంతైతే.. తొవ్వేది కొండంత లా ఉంటుంది. రఘునాథపాలెం మండలంలో భూమి లెవల్ కంటే కూడా దిగువకు మీటర్ల కొద్దీ తవ్వుతూ భారీగా ఆర్జిస్తున్నారు. అనుమతి పొందిన ప్రదేశాలకు కాకుండా.. వేరే ప్రదేశాలకు, ప్రైవేట్ వ్యక్తులకు మట్టిని విక్రయిస్తున్నారు. ఈ విషయంలో కూడా అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రజాప్రతినిధికి తెలిసి..
అక్రమంగా మట్టి తరలుతుందని, గుట్టలు మాయం అవుతున్నాయని.. ఇష్టారీతిన తోలకాలు సాగిస్తున్న అక్రమార్కులు భారీగా ఆర్జిస్తున్నారని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దృష్టికి రాగా.. మైనింగ్ అధికారులకు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించరాదని, అనుమతి లేకుండా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఎక్కడెక్కడి గుట్టలు కరిగిపోతున్నాయో వెంటనే తెలుసుకుని కట్టడి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది.