కొందరు కళ్లున్న కబోదిలా మాట్లాడుతున్నారు : పొంగులేటిపై మంత్రి అజయ్​ ఫైర్​

కేసీఆర్​ చేస్తున్న అభివృద్దిని చూసి కొందరు కళ్లున్న కబోదిలా మాట్లాడుతున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Update: 2023-03-14 10:28 GMT

దిశ, అశ్వారావుపేట : కేసీఆర్​ చేస్తున్న అభివృద్దిని చూసి కొందరు కళ్లున్న కబోదిలా మాట్లాడుతున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా జమ్మిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టిఏ సబ్ యూనిట్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖద్వారంగా ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మెచ్చా పట్టుదలతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

    ఇవాళ కొంతమంది నాయకులు ఇక్కడ తిరుగుతూ కేసీఆర్ ని గద్దె దించుతామని పగటి కలలు కంటున్నారని, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు లాంటి గొప్ప పథకాలతో మంచి పనులు చేయడం కేసీఆర్ చేసిన తప్పా, అందుకేనా కేసీఆర్ ని గద్దెదించాలని అనటం అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాని ఆనుకొని వెళ్లే గోదావరి జలాలు వందల వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ పాలకుడు కూడా సమైక్య పరిపాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి ఈ నీరుని అందించాలని ఆలోచన చేయలేదని, కానీ సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలలో ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా నీరందించేందుకు రూ.13 వేల కోట్ల రూపాయలు వెచ్చించి గోదావరి జలాలను తీసుకురావాలని ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. రూ.3500 కోట్లతో సీతమ్మ బ్యారేజ్ ను ఏర్పాటు చేస్తున్నారని, పంపు హౌస్ ల నిర్మాణం కూడా పూర్తయిందని, మరో ఐదు నెలల్లో ఆ నీళ్లు అశ్వారావుపేట నియోజకవర్గానికి రానున్నాయని చెప్పారు. ఇలాంటి పనులను చూసి చూడనట్టుగా నటిస్తూ కళ్లు ఉన్న కబోది లాగా ఎప్పుడు కడుగుతావ్ గోదావరి జలాలతో అని అంటున్నారని ఎద్దేవా చేశారు.

    ఇన్నేళ్లు గోదావరి జలాలు వృథాగా పోతే.. విలీన మండలాలను గుంజుకున్న బీజేపీ వైపు చూస్తున్న కొందరు నాయకులు ఇవాల్టి రోజున కేసీఆర్ ను అడిగే అంత వాళ్లయ్యారా అని ప్రశ్నించారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 31 వరకు కేసీఆర్ పంచన చేరి పబ్బం గడుపుకొని లాభ పడిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ నే విమర్శించే స్థాయికి వచ్చారా..? అని అన్నారు. గతంలో ఖమ్మం పార్లమెంటు పదవిలో ఉన్నప్పుడు అశ్వారావుపేటకు మీరు ఏం చేశారు.. తట్టెడు మట్టి పోశారా..? ఈ వేదిక ద్వారా మీరు చేసింది ఏంటని అడుగుతున్నానన్నారు. గతంలో ఖమ్మంలో గొప్పగా పనిచేసిన నాయకులు ఉన్నారు కానీ.. ఆ లిస్టులో నీ పేరు లేదని, ఎందుకంటే నువ్వు ఏమి అభివృద్ధి చేయలేదు.. చేయకపోగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నావని, మీకేదో సొంతంగా పదవులు రాలేదని.. మీకు వచ్చిన కడుపునొప్పి ప్రజలందరికీ వచ్చిందనే భ్రమల్లో కేసీఆర్ ను గద్దె దించుతాం అని రంకెలేస్తున్నారు కానీ అది మీ వల్ల కాదు అని పొంగిలేటిని ఉద్దేశించి అన్నారు.

     ఇంతకు ముందు జరిగిన కుట్రలన్నిటిని కేసీఆర్ ఛేదించారని, గుప్పెడు మందితో మొదలైన కేసీఆర్ ఇప్పుడు కోట్ల మంది గుండెల్లో నిక్షిప్తమై ఉన్నారని, ఆయన్ని గద్దె గద్దించడం మీలాంటి వాళ్ల వల్ల కాదు అని ఆయన్ని హెచ్చరించారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు కానీ.. కేసీఆర్ తెలంగాణ చిత్తశుద్ధి ముందు అవన్నీ సరిపోవని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కేసీఆర్ కు అండగా నిలుస్తారని బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానుల ఆత్మీయ సమ్మేళనాలలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఏ జెండా పట్టుకున్నా తన ఎజెండా ఇదేనని ఖమ్మం స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానని ఎన్నికల్లో చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు ఇక్కడ ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటికి కౌంటర్ గా అశ్వారావుపేటలో మంత్రి పువ్వాడ ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.  

Tags:    

Similar News