బాలింత మృతిపై కలెక్టర్ సీరియస్.. దిశ కథనానికి స్పందన

సత్తుపల్లిలోని చందమామ ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై గత నెల 29వ తేదిన దిశ దినపత్రికలో ప్రచురితమైన ‘వైద్యం వికటించి బాలింత మృతి’ కథనంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.

Update: 2024-10-01 06:43 GMT

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లిలోని చందమామ ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై గత నెల 29వ తేదిన దిశ దినపత్రికలో ప్రచురితమైన ‘వైద్యం వికటించి బాలింత మృతి’ కథనంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎం&హెచ్ఓ డాక్టర్ తలారి సీతారాం సత్తుపల్లికి చేరుకొని ఘటనపై ఆసుపత్రి నిర్వాహక వైద్యురాలు జీ రమ్యను వివరాల అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన మృతురాలు శ్రావణి (21)కి గర్భిణిగా ఆసుపత్రికి వచ్చినప్పుడు బాగానే ఉందని, అయితే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన తర్వాత రక్తం ఎక్కువగా పోతుండడంతో పరిస్థితి విషమిస్తోందని ముందుగా గ్రహించి ఖమ్మం రిఫర్ చేశామని వైద్యాధికారి సీతారాంకు వివరణ ఇచ్చారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతారాం.. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ చనిపోయే పరిస్థితికి చేరే వరకు ఏం చేశారు? డాక్టర్‌గా మీకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఏది ఏమైనా బాలింత మృతిమై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారని, ఈ ఘటనకు సంబంధించి సరైన సంజాయిషీ చెప్పాల్సి ఉంటుందని సీతారాం స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా ఆసుపత్రిపై తీసుకోబోయే చర్యలకు వైద్యులే బాధ్యులని సీతారాం స్పష్టం చేశారు. అనంతరం వైద్యురాలికి నోటీసు అందజేశారు.


Similar News