పల్లె దవాఖానాలో పడకేసిన వైద్యం

కొత్తగూడెం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పల్లె దవాఖానాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.

Update: 2024-09-07 12:51 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పల్లె దవాఖానాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. సిబ్బంది అందుబాటులో ఉండకపోగా ఉన్న వారు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టి వాటి అభివృద్ధికి నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె దవాఖానాల నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన సిబ్బందిలో కొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆరోగ్య సేవలకు తూట్లు పొడుస్తున్నారనే ప్రచారంతోపాటు విమర్శలు వస్తున్నాయి.

    వ్యాధుల సీజన్ లో కూడా పల్లె దవాఖానలో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే దవాఖానాల పనితీరు అధ్వానంగా మారినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి స్వచ్ఛమైన వాతావరణంతో కనిపించాల్సింది పోయి అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. దవాఖానాల ముందు సమాచార బోర్డులు కనిపించడం లేదు. సుజాతనగర్ పీహెచ్సీ పరిధిలో ఉన్న రాంనగర్ పల్లె దవాఖాన విచిత్రంగా దర్శనమిస్తుంది. భవనం ముందు ఉండాల్సిన బోర్డు పేషెంట్లకు సంబంధించిన బెడ్ పై కనబడుతుంది. అంతేకాకుండా అదే బెడ్ పై మందులు, పరిపాలనకు సంబంధించిన పుస్తకాలు ఉంచారు.

పల్లె దవాఖానాలపై పర్యవేక్షణ లేదు : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్

పల్లె దవాఖానాలపై వైద్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేదు. సిబ్బంది ఇష్టారాజ్యం అయిపోయింది. సమయపాలన పాటించడం లేదు. వ్యాధుల సీజన్ లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం విచారకరం. ప్రతి దవాఖానాలో సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉండాలి. కానీ ఈ పద్ధతి అమలు కావడం లేదు. అధికారులు దృష్టి సారించి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. 

Tags:    

Similar News