Governor Jishnu Dev Varma : పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత‌‌

పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత‌‌ అని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కోరారు.

Update: 2024-10-25 13:33 GMT

దిశ, ఖమ్మం : పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత‌‌ అని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) కోరారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి జిల్లా అధికారులు, ప్రముఖులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఖమ్మం జిల్లా ప్రాముఖ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కు తెలియజేశారు.

    ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య లాగే తాను పర్యావరణ వేత్తగా తన కెరియర్ ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన మన అందరిలో ఉండాలని అన్నారు. ధర్మో రక్షిత: రక్షిత: నినాదం ప్రకారం పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయడం చాలా బాగుందని, కొత్తగూడెం జిల్లాలో పాఠశాలల్లో మెడిసినల్ మొక్కలు పెంచుతున్నారని, ఖమ్మం జిల్లాలోను ఇది అమలు చేయాలని గవర్నర్ సూచించారు. జిల్లాలోని ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలని, చెట్లు మన జీవనానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

    ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, సార్నాథ్ లాగా బౌద్ద స్థూపం అభివృద్ధి కావాలని, అనేక మంది పర్యాటకులు జిల్లాకు రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ టూర్ చాలా బాగున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలతో పిల్లలు పాఠ్య పుస్తకాల కంటే మెరుగ్గా నేర్చుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించాలని గవర్నర్ సూచించారు. డబ్బుతో మాత్రమే అభివృద్ధి సాధ్యం కాదని, సమయం, మంచి విజన్, చిత్తశుద్ధి అవసరమని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక పురావస్తు శాఖ ప్రదేశాలు, దేవాలయాలు, స్టెప్ వెల్స్ ఉన్నాయని అన్నారు. భారీ వర్షాలు, విపత్తులను మనం ఎవరం ఆపలేమన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తక్కువగా జరిగే విధంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేపట్టిన పునరావాస చర్యలు, ప్రజలకు పరిహారం సకాలంలో అందజేసి ఆదుకున్న విధానం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు.

    వరదలు వంటి విపత్తు సమయాలలో ప్రజలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కోల్పోతారని, వాటిని ప్రజలకు త్వరగా అందించేందుకు ప్రత్యేకంగా క్యాంప్ లు నిర్వహించడం పట్ల కలెక్టర్ ను గవర్నర్ అభినందించారు. ఖమ్మం జిల్లాను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చే లక్ష్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు భాగస్వాములు కావాలని అన్నారు. విద్య, వైద్య రంగాలలో జిల్లా మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. జిల్లాలో మరోసారి పర్యటించినప్పుడు ప్రముఖులతో పర్యాటక ప్రాంతాలను పరిశీలిస్తానని గవర్నర్ తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి (MP Ramasahayam Raghuram Reddy)మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసినందుకు రాష్ట్ర గవర్నర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో యువకులైన కలెక్టర్లు ఉండటం అదృష్టమని, వారి నాయకత్వంలో జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్, బుద్ధ స్థూపం, కిన్నెరసాని, కేటీపీఎస్ మొదలైన అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, రాబోయే కాలంలో గవర్నర్ కు అందుబాటులో ఉన్న సమయంలో మరోసారి జిల్లాలో పర్యటించి వీటిని సందర్శించాలని ఎంపీ కోరారు.

     జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, ఎనీమియా కేసులు అధికంగా నమోదయ్యేవని, గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న చర్యల వల్ల నేడు గణనీయంగా తగ్గించామని, ఈ కేసులు మూడు సంవత్సరాలుగా ఆరు వంతుల వరకు తగ్గాయని తెలిపారు. డెంగ్యూ కేసుల నివారణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. జిల్లా ఖమ్మం ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేందుకు డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేశామని, పరీక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా శాంపిల్స్ కలెక్షన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్జికల్ క్యాన్సర్ ముందుగానే గుర్తించి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. జిల్లాలో 1512 ప్రభుత్వ పాఠశాలల్లో 1,53,967 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.31 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశామని అన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన, విద్యార్థులకు అవసరమైన గైడెన్స్ అందించేందుకు జిల్లా అధికారులు ప్రతి బుధవారం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నారని అన్నారు. గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ ఖమ్మం జిల్లాలో అమలు చేశామని అన్నారు.

     చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా క్రమ పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ, వారు లాభసాటిగా వ్యాపారాలు నడిపించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో 20 వేల మంది మహిళా సంఘాల సభ్యులతో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలతో పాల వ్యాపారం చేయించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో రాబోయే 3 సంవత్సరాలలో మిర్చి సాగు విస్తరణకు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మిర్చి చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఆయిల్ ఫామ్ సాగు ఖమ్మం జిల్లాలో ఉందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

    జిల్లాలో పిల్లల సంరక్షణ కోసం చిన్నారి వినూత్న కార్యక్రమం చేపట్టామని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నామన్నారు. సెప్టెంబర్ నెలలో భారీ వరదల వల్ల ఖమ్మం జిల్లా ఇబ్బంది పడిందని, 50 వేల మంది ప్రజలు ప్రభావితం అయ్యారని, 38 వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చేసిన కృషి కారణంగా వారం రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాలలో పునరుద్దరణ చేశామని, రికార్డు సమయంలో బాధితులకు నష్టపరిహారం అందించామని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాట్లాడుతూ‌‌.. చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం లభించే విధంగా ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలు పెంచుతున్నామని అన్నారు. చెట్లు పెంపకానికి ఉపయోగపడే విధంగా హరిత వేతనం పెంచాలని, ఇల్లు ఇప్పించాలని, తాను నాటిన మొక్కలు ఎండిపోకుండా గ్రామాల సిబ్బందితో నీళ్లు పోయించాలని ఆయన జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

     నంది అవార్డు గ్రహీత, కవి దేవేంద్ర మాట్లాడుతూ బాల కార్మికులపై రాసిన గీతానికి నంది అవార్డు 2003 సంవత్సరంలో లభించిందని తెలిపారు. సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా కళాకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, ఖమ్మం జిల్లాలోని పేద కళాకారుల జాబితా రాష్ట్రానికి పంపామని, వారికి దయచేసి కళాకారుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో ఉన్న నాటక రంగ సంస్థలకు ఆర్థిక సహాయం అందజేయాలని, రాష్ట్ర స్థాయిలో పౌరాణిక నాటక పోటీలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ.. 1870 వరద ప్రభావిత కుటుంబాలకు గవర్నర్ నిధులతో సహాయం అందించామని అన్నారు. 5600 సీనియర్ సిటిజన్ లకు సంవత్సరంలో 111 గ్రామాల్లో వైద్య సహాయం అందించామని అన్నారు. కాళోజీ అవార్డు గ్రహీత కవి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ న్యాక్ తో దేశంలోనే ఏ రేటింగ్ పొందిన కళాశాలలో తాను అధ్యాపకుడిగా పని చేస్తున్నానని అన్నారు.

    ఎమునూరు రాళ్లపై గవర్నర్ కు కవిత వినిపించారు. అనంతరం అంతర్జాతీయ క్రీడాకారిణి పవిత్రా చారి, అంతర్జాతీయ సెయిలర్ పి. అఖిల్, స్టేజీ ఆర్టిస్ట్ తాటి కొండల నరసింహారావు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, కవి ప్రసెన్ సాహిత్య, సీనియర్ ఆర్టిస్ట్ ఎన్. రవి, కవి మువ్వా శ్రీనివాస రావు, వ్యాఖ్యాత, తెలుగు టెక్స్ట్ బుక్ రచయిత కన్నెగంటి వెంకటయ్య, కవి, ఫైవెర్ ఆఫ్​ ఫ్రంట్ అవార్డు గ్రహీత ఇబ్రహీం నిర్గున్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పీసర ప్రభాకరరెడ్డి, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ ఆచార్య ఎస్. మాధవరావు తాము సంబంధిత రంగాల్లో అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సోమశేఖర శర్మ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News