నేడు ఢిల్లీలో కొండరెడ్లతో రాష్ట్రపతి సమావేశం..
దేశంలో ఆర్థిక అభివృద్ధికి దూరంగా, అత్యంత దయనీయస్థితిలో జీవనం సాగిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో కొండరెడ్లతో సమావేశం కానున్నారు.
దిశ, దమ్మపేట : దేశంలో ఆర్థిక అభివృద్ధికి దూరంగా, అత్యంత దయనీయస్థితిలో జీవనం సాగిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో కొండరెడ్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గంలో నుండి 15 మంది కొండరెడ్లు హాజరు కానున్నారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామం నుండి నలుగురు కొండరెడ్లు, అశ్వారావుపేట మండలం నుండి బండారుగుంపు, గోగులపూడి, నడిమిరెడ్డిగూడెం, తిరుమలకుంట గ్రామాల నుండి 11 మంది ఢిల్లీలో రాష్ట్రపతి ఏర్పాటుచేసిన సమావేశంలో హాజరుకానున్నారు.
అత్యంత మారుమూల ప్రాంతాల్లో జీవించే ఆదిమ జాతి గిరిజన తెగలవారు రోజువారి ఎదుర్కొనే సమస్యలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకోనున్నారు. పూసుకుంట గ్రామం నుండి వెళ్లిన కొండరెడ్లు వారికి రాష్ట్రపతి ద్రౌపతి మురుముతో మాట్లాడే అవకాశం కల్పిస్తే వారు రోజు ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన రహదారి, ఇల్లు, త్రీఫేస్ కరెంటు, వ్యవసాయ బోర్లు ఏర్పాటు తదితర సమస్యలను రాష్ట్రపతికి వివరిస్తామని వారు తెలిపారు. నేడు రాష్ట్రపతి తో సమావేశం అనంతరం దేశ నలుమూలల వైపు నుండి వస్తున్న ఆదిమ జాతి గిరిజన తెగలను మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంను సందర్శించి, అక్కడ ఉన్న పర్యటక ప్రాంతాలలో వీరికి సందర్శించే అవకాశం కల్పించబోతున్నారు.