వనసమారాధనతో ఐక్యత
కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ,సత్తుపల్లి : కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి పరిధిలోని వేంసూర్ రోడ్ నందు స్థానిక అర్బన్ పార్క్ లో ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు మరవబోనని, అందరితో కలిసి వన సమారాధనలో పాల్గొనడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా కమ్మ కుల సంఘం తరఫున మంత్రి తుమ్మలకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, రాష్ట్ర ఇరిగేషన్ సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి పట్టణానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.