పొంగులేటి అనుచరులే టార్గెట్‌గా అధికార పార్టీ భారీ వ్యూహం!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతుంది.

Update: 2023-08-23 05:33 GMT

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఏ పార్టీలో ఎవరుంటారో, ఏ నాయకుని చెంత ఎవరు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. చర్చలు పూర్తయ్యాకే విషయం వెలుగులోకి వచ్చేటట్లు అధికార పార్టీ నాయకులు చతురత ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు కంటగింపుగా తయారైన ఈ చేరికల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో తమ పార్టీలో చేరికలుంటాయిని బీజేపీ చీఫ్ ప్రకటించిన కొన్నిరోజులకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గులాబీ గూటికి వెళుతుండటం విస్మయం కలిగిస్తుంది. మొన్న పొంగులేటి అనుచరుడు భద్రాచలం నేత డాక్టర్ తెల్లం వెంకట్రావ్ అధికారపార్టీలో చేరగా.. తాజాగా మధిర నుంచి మరో నాయకుడు చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది.

దిశ బ్యూరో, ఖమ్మం: చేరికల పర్వం ఊపందుకోవడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో జోష్ మీదుంది. జిల్లా నాయకులు సీక్రెట్‌గా ఆపరేషన్ నిర్వహిస్తుండటంతో చివరి నిమిషం వరకు చేరికల విషయం తెలిసే అవకాశం లేకుండా పోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందానా అటు పొంగులేటి అనుచరులతో పాటు బీజేపీ నాయకులకు కూడా గాలం వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భద్రాచలం నేత డాక్టర్ వెంకట్రావ్ బీఆర్ఎస్‌లో చేరి ఏకంగా టికెట్ సాధించగా.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని కూడా గులాబీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. త్వరలో పొంగులేటి మరో అనుచరుడు మధిర నియోజకవర్గ నాయకుడు కూడా అధికార పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

కారు లోడ్ పెంచేందుకు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడి కావడం.. అసంతృప్తులు ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళుతుండంతో అంతకు ముందుగానే జిల్లాలో ఉన్న ఇతరపార్టీ నాయకులను బీఆర్ఎస్ లో చేర్పించేందుకు జిల్లా నాయకులు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ నాయకులు కొందరు అతనితో వెళ్లడంతో జిల్లా నాయకులు నష్ట నివారణ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ రాజకీయ భవిష్యత్‌పై వారికి భరోసా ఇస్తూ కారు లోడ్ పెంచే పనిలో ఉన్నారు.

మొన్న వెంకట్రావ్.. నేడు కోనేరు చిన్ని..

కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో పొంగులేటి అనుచరునిగా ముద్రపడ్డ డాక్టర్ తెల్లం వెంకట్రావ్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సూచనల మేరకు అధికారపార్టీలో చేరాడు. చేరిన వెనువెంటనే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మొదటి లిస్టులోనే టికెట్ దక్కించుకున్నాడు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని పార్టీ మారుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బీజేపీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది. ఇప్పటికే కోనేరు చిన్నితో సంప్రతింపులు పూర్తయినట్లు సీఎం కేసీఆర్ చిన్ని రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల24 లేదా 25న ముఖ్యమంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. వీరితో పాటు మధిర కు చెందిన పొంగులేటి అనుచరుడు ఒకరు గులాబీ పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఇతనికి కూడా మధిరలో కాంగ్రెస్ పార్టీ తరపున సీటు దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కీలకంగా వ్యవహరిస్తున్న జిల్లా నాయకులు

చేరికల వ్యవహారంలో జిల్లాకు చెందిన నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతామధు, రేగా కాంతారావు సహా ఇతర నాయకుల సలహాలతో వ్యవహారాన్ని చక్కబెడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతున్నారు. చేరిన వారి రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇస్తూ గులాబీ కండువాలు కప్పుతున్నారు. ఓ వైపు పొంగులేటి అనుచరులకు గాలం వేస్తూనే మరోవైపు బీజేపీ నాయకులనూ తమవైపు తిప్పుకుంటూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పదిస్థానాలను కైవసం చేసుకునేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

Tags:    

Similar News