‘డబుల్’ సమస్యపై పొంగులేటి నజర్

డబుల్ బెడ్ రూంల స్కామ్ వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

Update: 2023-05-20 02:29 GMT

దిశ, ఖమ్మంసిటీ: డబుల్ బెడ్ రూంల స్కామ్ వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. బాధితులంతా రేపు పొంగులేటిని తన నివాసంలో కలువనున్నారు. ఆయన కూడా సామాన్య ప్రజల నుంచి ఇంతగా దోచుకున్న వారిని, దోపిడికి సహకరించిన వారిని శిక్షించేలా పోరాటం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డబుల్ బెడ్ రూంలు అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపణలతో విరుచుకుపడుతున్న పోంగులేటి.. సామాన్య ప్రజల నుంచి ఇన్ని కోట్లు దోచుకున్న వారిని రక్షిస్తున్న దానిపై మరింతగా మండిపడుతున్నట్లు సమాచారం. బాధితులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సైతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వందలాది మంది నుంచి డబుల్ బెడ్ రూంలు, మైనారిటీ‌లోన్లు ఇప్పిస్తామని నిరుపేదల నుంచి లక్షలు వసూలు చేసిన ముఠా ఖమ్మం నియోజకవర్గ కేంద్రం వారు కావడంతో సమస్య మరింత జటిలం అవుతుంది. నియోజకవర్గ ప్రజలు అమాత్యుడి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా బోలేపల్లి లక్ష్మి, షేక్ సకీనా తోడు బీఆర్ఎస్ యువజన సంఘం నాయకుడు, అధికార పార్టీకి చెందిన మీడియా ప్రతినిధి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, సాధారణ సెక్షన్ల కింద జైలుకు పంపి, మిగతా వారిని కాపాడే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిలో ప్రధానంగా మీడియా ప్రతినిధి పాత్రపై అనేక అనుమానాలున్నాయి. ఈ కేసు తన మెడకు చుట్టుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేసి, బాధితుల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మును కొందరు ఖాకీలకు వాటా పంపారని సమాచారం. అందుకే పోలీసులు నామమాత్రమైన విచారణ చేసి కేసు రిజిస్టర్ చేసి ఇద్దరిని మాత్రమే జైలుకు పంపినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ , బీజేపీ డీలా

సామాన్యులు లక్షల రూపాయలు దోపిడికి గురైతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మౌనంగా ఉండటం పై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీతో చీకటి ఒప్పందం ఉన్నందునే ఇరు పార్టీలు మౌన ప్రదర్శన చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వామపక్షాలు సైతం మౌనం వహించడంపై అనుమానాలు వస్తున్నాయి.

Read more:

జిల్లాలోని సిట్టింగులు పదిలమేనా..!

Tags:    

Similar News