అంతా అక్రమమే..మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే క్వారీ తవ్వకాలు

ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కొంత కాలం నుంచి ఝాన్సీ గ్రానైట్ పేరుతో అనుమతులు తీసుకున్నట్టు కలరింగ్ ఇస్తూ, ఇప్పుడు ఆ పేరును పద్మావతి గ్రానైట్ పేరు మార్చి, అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2023-05-13 03:08 GMT

దిశ ఖమ్మం రూరల్: ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కొంత కాలం నుంచి ఝాన్సీ గ్రానైట్ పేరుతో అనుమతులు తీసుకున్నట్టు కలరింగ్ ఇస్తూ, ఇప్పుడు ఆ పేరును పద్మావతి గ్రానైట్ పేరు మార్చి, అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పద్మావతి గ్రానైట్ పేరుతోనే పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 149లో సుమారు ఆరెకరాల ఎన్‌ఎస్‌పీ ప్రభుత్వ భూమిలో గత ఆరు నెలలుగా గ్రానైట్ వ్యర్థాలను తోలుతూ, ప్రభుత్వ భూమిని క్రమంగా కబ్జా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మైనింగ్ అధికారులకు నెలనెలా గ్రానైట్ క్వారీ యాజమాని దగ్గర్నుంచి మామూళ్ల చేరుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో జిల్లా మైనింగ్ అధికారి గ్రానైట్‌కు సంబంధించిన ఏ చిన్న సమాచారాన్ని, దస్త్రాన్ని గానీ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో గ్రానైట్ వ్యర్థాలను ఆరు నెలల నుంచి పోస్తున్నా... జిల్లా మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది.

మరోవైపు నూతన కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మైనింగ్ కార్యాలయం ఎదుట ఎలాంటి సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడం మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు రకాల మైనింగ్‌లను పరిశీలించినట్లయితే, అనేక విషయాలు తేటతెల్లం అయ్యే అవకాశం ఉన్నది. ప్రధానంగా గ్రావెల్ మైనింగ్‌లో, గ్రానైట్ మైనింగ్‌లో గాని ఎంతోమంది యజమానులు విస్తీర్ణానికి మించి మైనింగ్ చేస్తున్నా గాని జిల్లా అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపణ ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతున్నదని తెలుస్తుంది. కొన్ని సర్వేనెంబర్ విషయంలో సైతం మైనింగ్ ఓచోట, సర్వేనెంబర్ మరొక చోట ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక ఆరోపణలు వస్తున్నా అంటి ముట్టినట్టుగా ఆ జిల్లా అధికారి వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది.

పోలేపల్లి పరిధిలోగల 149 సర్వే నెంబర్లలో పోసిన గ్రానైట్ వ్యర్థాన్ని తొలగించాలని గ్రానైట్ యాజమానికి నోటీసు ఇవ్వకపోవడం వెనక పెద్దమొత్తంలో నగదు చేతులు మారిందని స్థానిక గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పద్మావతి గ్రానైట్ పేరుతో పోస్తున్న వ్యర్థాన్ని తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆ అసిస్టెంట్ మైనింగ్ అధికారి అంతా తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News