Tellam Venkata Rao : వాళ్లకు లేని నిబంధనలు మాకెందుకుంటాయ్..?
వాళ్ళకో రూలు మాకొక రూలు ఎలా ఉంటుంది..?
దిశ,భద్రాచలం : వాళ్ళకో రూలు మాకొక రూలు ఎలా ఉంటుంది..? 2014,18 అసెంబ్లీ ఎన్నికలు తర్వాత టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నప్పుడు లేని నిబంధనలు... ఇప్పుడు మా విషయంలో ఎలా వర్తిస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రశ్నించారు. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారని 'దిశ ' వెంకట్రావును ప్రశ్నించగా... ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. మీరు కూడా కోర్టును ఆశ్రయుంచే ఆలోచన ఉందా ఆని అడుగగా... మాకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా కోర్టుకు వెళ్తామని అన్నారు. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిందని, నిర్ణయం స్పీకర్ తీసుకుంటారని, మాకు వ్యతిరేకంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా,పార్టీ పిరాయింపు విషయంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు ప్రతికూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో భద్రాచలం నియోజకవర్గం ఒక్కసారిగా వేడెక్కింది. మళ్ళీ ఎన్నికలు వస్తాయని కొందరు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాచలం నుండి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారాని మరికొందరు, ఇలా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వెంకట్రావు స్థానికుడు, ప్రజల అభిమానం తో విజయం సాధించారని, ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా... భయపడేది లేదని, భద్రాద్రి ప్రజలు వెంకట్రావు నే గెలిపించుకుంటారని ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.