పాల్వంచ, సుజాతనగర్ కలిపి కార్పొరేషన్‌గా కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెంని కార్పొరేషన్ ఏర్పాటుకు మంగళవారం అసెంబ్లీలో ఆమోదానికి తీర్మానం చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలు టు ఇంక్లైన్, కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, సుజాతనగర్‌లను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.

దిశ, కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెంని కార్పొరేషన్ ఏర్పాటుకు మంగళవారం అసెంబ్లీలో ఆమోదానికి తీర్మానం చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలు టు ఇంక్లైన్, కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, సుజాతనగర్‌లను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం అనంతరం నూతన కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. మరో నాలుగు రోజుల్లో గెజిట్ విడుదల కానుంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 97,337మంది జనాభా, పాల్వంచ మున్సిపాలిటీలో 89,721మంది జనాభా, సుజాతనగర్ ఏడు పంచాయతీలు 11,124మంది జనాభాతో కలిపి మొత్తం 1,98,182మంది జనాభా నూతన కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ వైశాల్యం 40.87చదరపు కిలోమీటర్లు, కొత్తగూడెం మున్సిపాలిటీ వైశాల్యం 15.87చదరపు కిలోమీటర్లు, సుజాతనగర్‌లోని ఏడు పంచాయతీలు 28.48చదరపు కిలోమీటర్లతో కలిపి మొత్తం 85.22చదరపు కిలోమీటర్లతో నూతనంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న కొత్తగూడెం
కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటుకు మార్గం సుగమం అవడంతో, అభివృద్ధిలో దూసుకుపోనుంది. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకపక్క కార్పొరేషన్, మరోపక్క విమానాశ్రయం ఏర్పాటుకు సైతం రంగం సిద్ధం కావడంతో వ్యాపారాలు పుంజుకొనున్నట్లు వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలం లోని ఏడు పంచాయతీలతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు కానుండడంతో చుట్టుపక్కల గిరిజన గ్రామాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
కార్పొరేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కేటాయించనున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటుతో నూతన పరిశ్రమలు, నూతన వ్యాపార స్థాపనకు మార్గం సుగమం కానుంది. మున్సిపాలిటీల కంటే కార్పొరేషన్లకు ఎక్కువ ఆర్థిక వనరులు కలిగి ఉండటంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెంది పట్టణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందుతాయి. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. నూతన ఉద్యోగ కల్పనతో నిరుద్యోగ సమస్య తొలగిపోతాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నూతన పెట్టుబడులకి, వ్యాపార వర్గాల విస్తరణకు ఎంతగానో దోహదపడుతుంది.
ఫలించనున్న కూనంనేని కృషి
కార్పొరేషన్ ఏర్పాటు కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి ఫలించనుంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడేన్ని నగరపాలక సంస్థగా ఉన్నతీకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని.. సీఎం రేవంత్‌రెడ్డిని పలుమార్లు కోరగా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించి గతంలోనే కార్పొరేషన్ ప్రకటన చేశారు. మంగళవారం అసెంబ్లీలో అధికారికంగా ఆమోదం కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే అని తెలుస్తుంది. దీంతో కొత్తగూడెం, పాల్వంచ, మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంబరాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావుకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటుతో సరి'కొత్త'గూడెం
కార్పొరేషన్ ఏర్పాటవడాన్ని స్వాగతిస్తున్నాం . జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సరి'కొత్త' కొత్తగూడెంలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు అధిక మొత్తంలో మంజూరు అయ్యే అవకాశాలు ఉండటంతో, కొత్తగూడెం అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకు పోతుంది.- సిహెచ్. చంద్రశేఖర్ చారి, కొత్తగూడెం