టీఎన్జీఓస్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై కదులుతున్న డొంక..
ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములకు విపరీతమైన ధరలు

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములకు విపరీతమైన ధరలు ఉండటంతో అక్రమార్కులు అనేక మార్గాల్లో భూములపై కన్నేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. పైకి ఉద్యోగస్తుల్లా, ఉద్యోగ సంఘాల నాయకుల్లా కనిపిస్తున్నా కొందరు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు జిల్లా కేంద్రంలో ఏం జరుగుతుందన్న చర్చ సహజంగానే సాగుతున్నది. ఈ క్రమంలోనే వెలుగుమట్ల పరిధిలోని టీఎన్ జీవోస్ హౌసింగ్ సొసైటీలో భారీగా అవినీతి జరిగిందని, అక్రమార్కులు రెచ్చిపోయి అందినకాడికి దండుకున్నారని, సొసైటీకి చెందిన భూములను అక్రమంగా విక్రయించి కోట్లు సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.35 కోట్ల విలువైన భూముల కుంభకోణం జరిగిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
అసంపూర్తిగా ప్లాటింగ్..
టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 1987 సంవత్సరం నుంచి 1990 సంవత్సరం వరకు వెలుగుమట్ల పరిధిలోని సర్వే నంబర్లు 142, 144, 158, 159, 163 లో దాదాపు 57 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి అసంపూర్తిగా ఫ్లాటింగ్ చేసి ఉద్యోగులకు అప్పగించారు. అయితే పూర్తిస్థాయిలో ప్లాటింగ్ చేయకుండా దాదాపు 7ఎకరాలను అలాగే ఉంచి క్రమక్రమంగా విక్రయించడం మొదలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర 5 కోట్లు పలుకుతుండటంతో రిటైర్డ్ ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యమమే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడి భూములు విక్రయించారని, గతంలో ప్లాటింగ్ చేసి ఇచ్చిన భూములు సైతం కొన్ని అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు కొందరు ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారని, వారి భూములు కూడా కొన్ని అన్యాక్రాంతం కాగా.. మరికొన్ని విక్రయించారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు సరైన ఆధారాలు చూపిస్తు ఆ శాఖకు చెందిన మంత్రితో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు.
కలకలం రేపిన దిశ కథనం..
ఈ క్రమంలో ఈ నెల 8న ‘రూ.35 కోట్ల భూమి హాంఫట్’ అన్న కథనంతో దిశ మెయిన్ లో ప్రచురితం కావడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. ఇంత భారీ స్కాం వెనుక ఎవరున్నారన్న విషయమై తీవ్ర చర్చ జరిగింది. అంతేకాదు ఏ సమయంలో ఇంత మొత్తంలో భూ క్రయ, విక్రయాలు జరిగాయి, ఎవరి ప్రోద్బలంతో జరిగాయన్న చర్చ జోరుగా సాగింది. ఉద్యోగులకు పంపిణీ చేసిన భూములపై ఇప్పటి సొసైటీ అక్రమంగా ఎలా విక్రయించిందన్న చర్చ సాగడంతో పాటు అసలు ఉద్యోగులు భూములు ఉన్నాయా?లేదా తెలియకుండా వారికి కూడా విక్రయించారా? అన్న సందేహం సహజంగానే ఉద్యోగులకు కలగడం ఆందోళన కలిగిస్తుంది.
సీరియస్‌గా దృష్టి పెట్టిన ఇంటెలిజెన్స్..
దిశ లో కథనం రాగానే ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయమై సీరియస్ గా దృష్టి సారించారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలతో పాటు రెవెన్యూ, సొసైటీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, వివరాలు ఇప్పుడే బయటకు వెల్లడించలేమని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు దిశకు తెలిపారు.
మంత్రి తుమ్మల కు ఫిర్యాదు..
తాజాగా రెండు రోజుల క్రితం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ లో జరిగిన అక్రమాలపై కొందరు రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. జరిగిన అక్రమాలపై మంత్రి ఆధారాలతో సహా వివరించారు. భారీ ఎత్తున సొసైటీ భూములు చేతులు మారాయని, అక్రమార్కులు ఉద్యోగుల భూములు విక్రయించి కోట్లాది రూపాయలు సంపాదించారని తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు ఫోన్ చేసి టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. నిజానిజాలు వెలికితీసి నివేదిక తయారు చేసి తనకు అందించాలని సూచించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.