Kammam: అప్పు ఇస్తే అంతే.. నగరంలో పేట్రేగిపోతున్న ఎగవేతదారులు

ఖమ్మం నగరంలో రోజురోజుకూ డబ్బులు తీసుకుని ఎగవేతదారులు ఎక్కువవుతున్నారు.

Update: 2024-12-01 02:49 GMT

ఖమ్మం నగరంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేవారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. వడ్డీ ఆశజూపి కొందరు, చేబదులు పేరుతో మరికొందరు, స్నేహితుల వద్ద, తెలిసిన వారి వద్ద, తోటి వ్యాపారులమంటూ ఇంకొందరు డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారు. తిరిగి అడిగితే.. ఇచ్చిన వారిపైనే కేసులు పెడుతూ.. కోర్టుల చుట్టూ తిప్పిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఐపీ దాఖలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తూ.. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వారి మాయమాటల్లో పడి అప్పు ఇస్తే ఇప్పుడు మొత్తం పోగొట్టుకోవాలా అంటూ బాధితులు వాపోతున్నారు. న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్తే కోర్టుకే వెళ్లాలని సలహాలిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎగవేతదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం బాధితులు ఆందోళన చెందుతున్నారు.

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో రోజురోజుకూ డబ్బులు తీసుకుని ఎగవేతదారులు ఎక్కువవుతున్నారు. చిన్న, సన్నకారు వ్యాపారాలతో మొదలై అనతి కాలంలోనే పెద్దపెద్ద వ్యాపారులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నట్టు బిల్డప్ ఇస్తున్న కొంతమంది అప్పు తీసుకుని కొత్త రకం ఫ్యాషన్‌కు శ్రీకారం చుడుతున్నారు. వడ్డీలు ఆశజూపి కొందరు, చేబదులు పేరుతో మరికొందరు, స్నేహితుల వద్ద, తెలిసిన వారివద్ద, తోటి వ్యాపారులమంటూ ఇంకొంతమందిని ఎంచుకొని డబ్బులు తీసుకుంటూ.. తీసుకున్నాక ఇచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి అడిగితే.. ఇచ్చిన వారిపైనే కేసులు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పిస్తూ.. రుణదాతలకు ఎగనామం పెడుతూ.. ఐపి దాఖలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల డబ్బులను వడ్డీ ఆశలు చూపి తీసుకొని ఎగనామం పెడుతున్న వారికి న్యాయస్థానాలు, పోలీసులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వారి మాయమాటల్లో పడి ఇచ్చినందుకుగాను ఇప్పుడు మొత్తం పోగొట్టుకోవాలా బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాల్సిన న్యాయవ్యవస్థ, పోలీసులు, రాజకీయ నాయకులు ఇలాంటి ఎగవేత దారులకు తోడుపడుతున్నట్లు విమర్శిస్తున్నారు.

ఇటీవల నగరంలో పేరుగాంచిన బట్టల దుకాణ యజమాని ఒకరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి పెట్టిన సంస్థను మూసివేసి, రుణదాతలకు డబ్బులు చెల్లించకుండా వెళ్లారని తెలుస్తున్నది. ఆ తర్వాత మరో కమీషన్ వ్యాపారి.. ఓ ప్రైవేట్ బ్యాంకు యజమాని సొంత బంధువు కావడం తాను కూడా వ్యాపారం నష్టం పేరుతో ఊడయించి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఓ పెద్ద వ్యాపారి కుమారుడు చెరుకూరి శ్రీధర్ చిట్ ఫండ్ కంపెనీలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలను రుణదాతలు నుంచి అప్పుగా తీసుకొని వారికి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో ఓ కుటుంబం ఆయన ఇంటి ముందే నిరసనకు దిగింది. తమ డబ్బులు ఇవ్వకుంటే ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటామని తెలిపింది. ఇంత జరుగుతున్నా.. న్యాయవ్యవస్థ కానీ ఇటు పోలీసు వ్యవస్థ కాని చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం బాధితులకు మరింత ఆందోళన కలుగజేస్తోంది. ఇప్పటికైనా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా పారిపోయే వారికి తగిన బుద్ధి చెప్పాలని, తమకు రావాల్సిన డబ్బును ఇప్పించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

Tags:    

Similar News