అధ్యయనోత్సవాలకు వేళాయే...

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రేపటి నుండి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-12-30 12:38 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రేపటి నుండి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 20వ తేదీ వరకు జరిగే అధ్యయనోత్సవాలలో భాగంగా మంగళవారం రామయ్య మత్య్సావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 9న జరిగే తెప్పోత్సవం, 10న జరిగే ఉత్తర ద్వారంలో రామయ్యను దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, వివిధ రాష్ట్రాల నుండి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మంగళవారం నుండి జనవరి 8వ తేదీ వరకు భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సుదూర ప్రాంతాలలోని భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.

    రామాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, చాందిని వస్త్రాలతో అలంకరించారు. రామాలయం చేరుకునే దారుల దగ్గర స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ శీఘ్ర దర్శనం అయ్యేలా రామాలయం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే అందరికీ ప్రసాదం అందించేందుకు రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ మధ్యాహ్నం నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముక్కోటి పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే అనేకసార్లు పర్యవేక్షించారు. ఈసారి భక్తులకు కనువిందు చేసేలా లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. అలాగే గోదావరి తీరంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 40 కుటీరాలను ఏర్పాటు చేసి భక్తులకు గిరిజన వంటలను సైతం రుచిచూపనున్నారు.


Similar News