రాజీవ్ గాంధీ విగ్రహానికి అవమానం..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరాలో అవమానం జరిగింది..

Update: 2023-02-22 07:57 GMT

దిశ, వైరా: భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరాలో అవమానం జరిగింది. ఆ మహానేత విగ్రహం కనిపించకుండా కాంగ్రెస్ పార్టీలోని నాయకుడితో పాటు ప్రైవేటు వ్యక్తులు ఉన్న ఆయన విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా రాజీవ్ గాంధీ విగ్రహం జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రజలకు కనిపించడం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టిన వారిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క పనిచేసిన సమయంలో వైరాలోని మధిర క్రాస్ రోడ్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం కనిపించకుండా చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి వచ్చేవారికి ఆ విగ్రహం కనిపించకుండా వైరా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మాలోత్ రాందాస్ నాయక్ హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆ విగ్రహం ముందు జీవి మాల్ వారితోపాటు మరో ప్రైవేటు వ్యక్తి తన వ్యాపారానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

దీంతో రాజీవ్ గాంధీ విగ్రహం కనిపించకుండా ఈ ఫ్లెక్సీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ విగ్రహం కనిపించకుండా అవమాన పరుస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన మాలోత్ రాందాస్ నాయక్ రాజీవ్ గాంధీ విగ్రహానికి తన పేరుతో అడ్డంగా ఫ్లెక్సీ పెట్టడం వైరాలో వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీ మహానేత విగ్రహానికి అడ్డంగా రాందాస్ నాయక్ ప్లెక్సీ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా జిల్లా కాంగ్రెస్ అధిష్టానం స్పందించి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ పెట్టిన ఫ్లెక్సీలు తొలగించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.

Tags:    

Similar News