దిశ ఎఫెక్ట్.. సంతబజార్ లో 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు..
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న సంతబజార్లో ఎట్టకేలకు విద్యుత్ అధికారులు సోమవారం రాత్రి 8 గంటల కల్లా 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు పూర్తి చేశారు.
దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న సంతబజార్లో ఎట్టకేలకు విద్యుత్ అధికారులు సోమవారం రాత్రి 8 గంటల కల్లా 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు పూర్తి చేశారు. సంత బజారులోని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఫై లోడ్ పడి గత మూడురోజులుగా ఆ ప్రాంతంలో రాత్రివేళల్లో విద్యుత్తు లేక ప్రజలు నరకం అనుభవించారు. ఈ విషయమై ఆదివారం రాత్రి దిశ వెబ్సైట్లో "మూడు రోజులుగా కరెంటు బంద్ - చీకట్లో మగ్గుతున్న సంత బజార్ " అనే వార్త కథనం ప్రచురితమైంది. అదేవిధంగా ఆదివారం అర్ధరాత్రి సంత బజారులోని విద్యుత్ వినియోగదారులు వైరాలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.
ఈ విషయమై సోమవారం "విద్యుత్ విజయోత్సవం వేళ.. రోడ్డెక్కిన వినియోగదారులు" అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన విద్యుత్ అధికారులు ఆగ మేఘాల మీద సంతబజారులో 160 కె.వి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ను ఆ వార్డు బీఆర్ఎస్ నాయకులు ఏదునూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా సంత బజార్ లోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. తమ సమస్యను పరిష్కరించేందుకు వార్త కథనాలు రాసి కృషి చేసిన దిశపత్రికకు సంతబజార్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.