15 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు
ఏజెన్సీలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ భూములనే టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు.
దిశ, మణుగూరు: ఏజెన్సీలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ భూములనే టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కొనకూడదు, అమ్మకూడదని నిబంధనలు ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం ఆ నిబంధనలను పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. మండలంలో ఉన్న కొందరు వైట్ కలర్ నాయకులే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను కబ్జా చేపిస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ భూములను అమ్మకాలకు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వినపడుతోంది. అధికారులకు బెదిరించో,నాయన భయానా ఇచ్చో ప్రభుత్వ భూములను కొల్లకొడుతున్నారు. ఈభాగోతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయిగూడెం రామానుజవరం మధ్యలో ఉన్న 853 సర్వే నెంబర్‌లో జరుగుతోంది.
ఆ భూమిలో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని ఉన్న ప్లాన్ ఏమైంది
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే.నెం 853లో 15 ఎకరాల సువిశాల స్థలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని అప్పుడున్న అధికారులు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే నేటికీ ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ పాఠశాల నిర్మించక పోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాల నిర్మించాలనే ఉద్దేశంతోనే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తీశారా. లేక ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని పేరుతో ప్రభుత్వ భూమిని అమ్మకం చేయాలనీ చూస్తున్నారా అనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు పలరాం పంచుకున్నట్లు పంచుకొని లక్షల రుపాయలకు అమ్మకాలు చేస్తున్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసంత దూరంలో ఉండటంతో ప్రభుత్వ భూమి హాట్ కేక్‌గా మారింది. దీంతో ప్రభుత్వ భూమిపై లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన హైవే దారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు లక్షల రూపాయలకు అక్రమంగా అమ్మకాలు చేస్తుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిలోనే అక్రమ నిర్మాణాలు వెంటనే నిలుపుదల చేయాలనీ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూమి లోనే దర్జాగా మట్టి తోలకాలు..
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే గాక,అక్రమ నిర్మాణం చేపట్టడమే గాక మళ్ళీ పై పెచ్చుగా కొందరు వ్యక్తులు దర్జాగా మట్టి తోలకాలు చేస్తున్నారు. మట్టి తోలకాలు చేస్తూ ప్రభుత్వ భూమిని చదును చేస్తూ ప్లాట్లుగా మార్చుకొని ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. నిర్మించిన ఇండ్లను లక్షల రుపాయలకు అమ్మకాలు చేస్తున్నారు.
కరోనా సోకింది.. నాకు ఏం తెలియదు.. మతిమరుపు వచ్చిందంటున్న గత తహసీల్దార్
తహసీల్దార్ నారాయణమూర్తి గతంలో మండల కేంద్రంలో పని చేశారు. ఈయన హయాంలోనే సర్వే.నెం 853లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని జిల్లా అధికారులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే నేడు ఆ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణం చేపడుతున్న విషయంపై వివరణ కోరగా తనకు కరోనా సోకిందని..తనకు ఏం తెలియదు..ఏమి గుర్తు లేదని..మతిమరుపు వచ్చిందని చెప్పడం గమనార్హం.
పీడీ యాక్ట్ కేసు నమోదు అంటున్న నేటి తహసీల్దార్...
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే అటువంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తానని నేటి తహసీల్దార్ రాఘవరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న ఎన్నో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే అటువంటి భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పజెప్పానని తెలియజేశారు. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు ఇంటి పన్నులు ఇవ్వదని, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ మీటర్ ఇవ్వదని కూడా తెలియజేశామని తెలిపారు. మండలం లో ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.