అడ్డగోలుగా నిర్మాణాలు.. ఆకాశమే హద్దుగా భవల అంతస్తులు

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో అంతే వేగంగా అక్రమ భవన నిర్మాణాలు వెలుస్తున్నాయి.

Update: 2023-03-14 02:39 GMT

దిశ ఖమ్మం సిటీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో అంతే వేగంగా అక్రమ భవన నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందిన తర్వాత బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపట్టే క్రమంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అనుమతి ఒకలా తీసుకుంటూ నిర్మాణం మరోలా చేపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించే అధికారులను, రాజకీయ నాయకులను, మీడియాను మేనేజ్ చేస్తూ తప్పులను కప్పి పుచ్చుకుంటున్నారు.

దీంతో నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మూడంతస్తులకు పైగా నిర్మాణాలు చేపట్టాలంటే ఆభవనం చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేంతా స్థలం, ఇంకుడు గుంతలు, సెల్లార్, భవిష్యత్ రోడ్డు విస్తరణ కోసం నగరపాలక సంస్థకు స్థలం మార్ట్ గేజీ చేయాల్సి ఉన్నా ఇవేమి పాటించకుండానే ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు అనుమతులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అంతేగాక ఎన్ఎస్పీ రోడ్లో బొల్లికొండ శ్రీదేవి ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్న భవనానికి సైతం ఇదే పరిస్థితిని తెలుస్తున్నది. ఇక రాపర్తి నగర్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లో ఓనిర్వాహకుడు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించినట్లు స్థానికులు చెప్పుకొస్తున్నారు. అంతేగాక ఆ నిర్వాహకుడు తన వెనక ఓ పత్రిక విలేకరి ఉన్నాడని, ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోమని, ఇంటి అనుమతి పత్రాలు చూపించేది లేదంటున్నాడు.

ఈ విషయం దిశ ప్రతినిధి దృష్టికి రావడంతో వెంటనే అధికారులకు సమాచారం చేరవేశారు. ఓవైపు నగరంలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్న తరుణంలో కొందరు రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా తయారవుతున్నది. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు నగరాభివృద్ధికి సంకటంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు జోక్యం పెరగడంతోనే నిబంధనలకు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయని, ఉన్నతాధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News