కోటీశ్వరులకు ‘ఆసరా’.. కారేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు
ఆర్థిక వనరులను ఉత్పత్తి చేయలేని వారు.. వారి కుటుంబాలను పోషించే బాధ్యతను తీసుకున్న వ్యక్తులందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం కారేపల్లి మండలంలో అభాసుపాలవుతోంది.
దిశ, ఖమ్మం బ్యూరో: ఆర్థిక వనరులను ఉత్పత్తి చేయలేని వారు.. వారి కుటుంబాలను పోషించే బాధ్యతను తీసుకున్న వ్యక్తులందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం కారేపల్లి మండలంలో అభాసుపాలవుతోంది. ఈ పథకం అమలు తీరులో అక్రమాలను చూస్తే పథకానికి ప్రాణముంటే ఆత్మహత్య చేసుకుంటుందంటే అతిశయోక్తికాదు. నిబంధనలు నిలువునా పాతరేసి కారేపల్లి మండలంలో ఐదు వందలకు పైగా అనర్హులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేశారు. ఆర్థికంగా స్థిరపడి తరతరాలకు ఆస్తులు కూడబెట్టుకున్న కోటీశ్వరులకు కూడా పెన్షన్ మంజూరు చేశారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న కొందరి తల్లిదండ్రులకు కూడా పెన్షన్లు ఇవ్వడం ఇక్కడ అవినీతి అధికారుల అక్రమాలు ఏరేంజ్‌లో ఉన్నాయో స్పష్టం అవుతోంది.
కోటీశ్వరులకు పెన్షన్లు..
మండల కేంద్రానికి చెందిన భవనాశి గణేశ్ అనే వ్యాపారికి ఆసరా పెన్షన్ వస్తుంది. ఈ వ్యాపారి మండలం మొత్తంలో కూడా ఎక్కడా లేనివిధంగా 30గదులతో భారీ విలాసవంతమైన భవన సముదాయం నిర్మించాడు. దాని విలువ రెండు కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయ భవనం ఎక్కి చూస్తే ఈ వ్యాపారి విలాసవంతమైన భవనం కనిపిస్తుంది. అధికారులకు అంత సోయి లేకుండా ఎలా మంజూరీ చేశారనేది ఆశ్చర్యం కలిగిస్తున్నది. కారేపల్లిలోనే మరో ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి శ్రీరామ్ బూబ్‌కు ఆసరా పెన్షన్ మంజూరు చేశారు. బూబ్ కుటుంబానికి కారేపల్లిలో కోట్ల విలువైన సినిమాహాల్, భారీ భవన సముదాయాలు పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందనే విషయం అందరికీ తెలుసు. దీంతో పాటు మహారాష్ట్ర కు చెందిన ఈశ్రీరామ్ బూబ్‌కు అక్కడ ద్రాక్ష తోట కూడా ఉందని వారి కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఇంత ఐశ్వర్య వంతుడికి అధికారులు పెన్షన్ మంజూరు చేశారు. మండల కేంద్రంలో ఉండే నాగవెల్లి సహదేవ్ ఇతను వృత్తి రీత్యా బార్బర్ ఐనా ఇతని ఆస్తుల విలువ కోట్లలోనే ఉంటుంది. కారేపల్లిలోని టాప్ టెన్ సంపన్నుల్లో ఇతను ఒకరు. ఈ కోటీశ్వరుడికి కూడా అధికారులు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. మండల కేంద్రంలోని మరో వ్యాపారి ఎర్రా చక్రపాణి ఆసరా పెన్షన్ పొందుతున్నారు. కారేపల్లి మెయిన్ రోడ్డులో నివాసముంటున్న మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణ, ఆయన భార్య రత్తమ్మ ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ వస్తుంది. వీరి ఇద్దరి కొడుకుల్లో ఒకరు ఆర్టీసీ కండక్టర్, మరొకరు వ్యాపారం చేస్తారు. కారేపల్లికి చెందిన ఆర్కాల కౌసల్యకు పెన్షన్ మంజూరు చేశారు. ఈమె భర్త ఫార్మాసిస్ట్ ఇతనికి ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా భార్యకు పెన్షన్ మంజూరు చేశారు. మాధారం గ్రామానికి చెందిన వడ్డే దుర్గమ్మకు ఇద్దరు కుమారులు కాంట్రాక్టర్లు. ఈ సంపన్న కుటుంబం కూడా ఆసరా పెన్షన్ పొందుతోంది. గాంధీనగరం గ్రామానికి చెందిన ఆకుల గోపాలరావు కుమారుడు ఖమ్మంలో వ్యాపారవేత్త. కోట్లకు పడగెత్తిన ఈ కుటుంబం ఆసరా పెన్షన్ పొందుతోంది.
ఎన్ఆర్ఐ కుటుంబాలకూ ఆసరా పెన్షన్లు..
విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే పలువురి తల్లిదండ్రులకు కూడా కారేపల్లి మండలంలో ఆసరా పెన్షన్లు మంజూరు చేశారు. మండలంలోని మాధారం గ్రామానికి చెందిన మంకెన పెద్దసైదయ్య కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దసైదయ్య ఆసరా పెన్షన్ పొందుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వడ్డే పుల్లయ్య కుమారుడు ఎన్ ఆర్ఐ. పుల్లయ్యకు పింఛన్ వస్తుంది. మాధారం గ్రామానికి చెందిన గార్లపాటి మల్లేశ్వేర్ రావు కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కుటుంబానికి ఆసరా పెన్షన్ మంజూరు చేశారు. కారేపల్లికి చెందిన ఎస్.కె బందెల్లి కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. బందెల్లి ఆసరా పెన్షన్ పొందుతున్నాడు. ఈ తరహాలో నిబంధనలకు విరుద్ధంగా మరెన్నో ఎన్ఆర్ఐ కుటుంబాలకు అధికారులు ఆసరా పెన్షన్ లు మంజూరు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ఆసరా పథకం నిబంధనల ప్రకారం కొడుకులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే వారి తల్లిదండ్రులకు పెన్షన్ మంజూరు చేయకూడదు. కారేపల్లి మండలంలో నిబంధనలు తుంగలో తొక్కి అనేక మందికి పెన్షన్ మంజూరు చేశారు. కారేపల్లికి చెందిన కొండపల్లి రాములుకు ఇద్దరు కుమారులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులే ఇతనికి పెన్షన్ వస్తుంది. గాంధీనగరం గ్రామానికి చెందిన ఇర్పా జగ్గయ్యకు ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు. జగ్గయ్యకు ఆసరా పెన్షన్ వస్తుంది. గాదెపాడుకు చెందిన ధారావత్ శంకర్‌కు కొడుకూ కోడలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. శంకర్ పెన్షన్ పొందుతున్నాడు. మాధారం గ్రామానికి చెందిన గుర్రం రమణమ్మ కొడుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. రమనమ్మకు పెన్షన్ వస్తుంది. మాధారం గ్రామానికి చెందిన అనసూర్య కొడుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. అనసూర్యకు పెన్షన్ మంజూరు చేశారు. సూర్యా తండాకు చెందిన లావుడియా రాములు ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులే. చాందావత్ జామ్లాకు ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగులు వీరంతా ఆసరా పెన్షన్ పొందుతున్నారు. మండలంలో ఈ తరహాలో నిబంధనలకు విరుద్ధంగా పొందే ఆసరా పెన్షన్ లు అనేకం ఉన్నాయి. అధికారులు చిత్తశుద్ధితో విచారణ చేపడితే మండలంలో ఐదు వందలకు పైగా అనర్హుల చిట్టా వెలుగులోకి వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు అనేక మంది దివ్యాంగుల పెన్షన్‌లు పొందుతున్నారు.
నిబంధనలు స్పష్టంగా ఉన్నా..
ఆసరా పధకంలో అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కొందరు అవినీతి అధికారుల చేతివాటంతో కారేపల్లి మండలంలో ఆసరాలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దరకాస్తుదారుడి జీవనశైలి ఆధారంగా ధ్రువీకరణ అధికారి అనర్హులను నిర్ధారించేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. వాటిని ఎక్కడా ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా ముడుపులందుకుని మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా దృష్టి పెట్టి విచారణ జరిపితే కారేపల్లి మండలంలో 500 పైగా అక్రమ పెన్షన్లు వెలుగులోకి వస్తాయి.