Godavari flood : గండం తప్పింది...తగ్గుతున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Update: 2024-07-23 14:19 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయింది. గతంలో చిన్నపాటి వర్షానికే భద్రాచలం పట్టణంలోని రామాలయం పరిసర ప్రాంతాలతో పాటు పలు కాలనీలు ముంపునకు గురయ్యేవి. కానీ ఈసారి కరకట్ట స్లుయుజ్ల నుండి గోదావరి నీరు లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే పట్టణంలోని వరద నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి గోదావరిలోకి పంప్ చేయడం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా, ముంపు సమస్య లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్న

     గోదావరి, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు పెరగడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమంగా పెరుగుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగుల వరకు పెరిగిన గోదావరి 10 గంటల వరకూ నిలకడగా ఉంది. ఉదయం 11 గంటల నుండి నెమ్మదిగా తగ్గుతూ సాయంత్రం 7 గంటలకు 1.10 అడుగులు తగ్గి 50.5 అడుగులు మేర ప్రవహిస్తుంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాతుతుందని అధికారులు భావించి ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు వరద ఉధృతి తగ్గింది. కిన్నెరసానికి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టునకు 21,524 క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా, 25 గేట్లు ఎత్తి 22,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మంగళవారం గోదావరి పెరగడం కారణంగా దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రవాణా స్థంభించింది. గోదావరి తగ్గుముఖం పట్టాక రాకపోకలు యాథావిధిగా సాగాయి.

Tags:    

Similar News