చుక్కనీరు కరువు.. దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు

భానుడు భగ భగ మంటూ మండుతున్న ప్రస్తుత వేసవికాలంలో వైరా మండలంలోని మూడు గ్రామాలకు వారం రోజులుగా మిషన్ భగీరథ పథకం కు సంబంధించిన మంచి నీటి చుక్క కరువైంది

Update: 2023-03-15 06:45 GMT

దిశ, వైరా : భానుడు భగ భగ మంటూ మండుతున్న ప్రస్తుత వేసవికాలంలో వైరా మండలంలోని మూడు గ్రామాలకు వారం రోజులుగా మిషన్ భగీరథ పథకం కు సంబంధించిన మంచి నీటి చుక్క కరువైంది. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలు వారం రోజులుగా మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, వారం రోజులు గడిచినా ఈ సమస్యను పరిష్కరించే వారు కరువయ్యారు. వైరా మండలంలోని గండగలపాడు, స్నానాల లక్ష్మీపురం, ముసలిమడుగు గ్రామాలకు వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు రోజుల తరబడి జ్యాప్యం చేయడం విమర్శలకు దారితీస్తుంది. అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆయా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

20 మీటర్ల పైపు కోసం వారం రోజులుగా నిరీక్షణ..

కేవలం 20 మీటర్ల పైపు కోసం వారం రోజులుగా మూడు గ్రామాల ప్రజలు మంచినీటి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. వైరా మండలంలోని గండగల పాడు, స్నానాల లక్ష్మీపురం, ముసలమడుగు గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద మంచినీరు సరఫరా చేసేందుకు గతంలో పొలాల్లో పైప్ లైన్ వేశారు. గండగలపాడు గ్రామ సమీపంలో హెచ్ డి పి ఈ 140 డయా పైపులైన్ ను కూడా ఓ రైతు పొలంలో వేశారు. అయితే ఆ రైతు పొలాన్ని డిటిసిపి అనుమతితో నిర్వణ రియల్ ఎస్టేట్ వెంచర్ గా అభివృద్ధి చేశారు. దీంతో తమ వెంచర్ సరిహద్దు తెలుపుతూ ప్రహరి గోడ నిర్మించేందుకు మిషన్ భగీరథ పైపులైన్ అడ్డుగా ఉందని, ఆ పైపులైన్ మార్చాలని వెంచర్ యజమాని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు .

దీంతో అధికారులు వెంచర్ లోని పైపులైను తొలగించి రోడ్డు పక్కన వేసేందుకు పనులు చేపట్టారు. వెంచర్లో సుమారు 200 మీటర్ల దూరం వేసిన పైపులైన్‌ని బయటకు తీశారు. అయితే ఈ పైపులైను రోడ్డు పక్కన వేసేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు పక్కన పైప్ లైన్ వేసేందుకు 220 మీటర్ల పైప్లైన్ అవసరమవుతుంది. ప్రస్తుతం 200 మీటర్ల దూరంకే హెచ్‌డీపీ 140 డయా పైపు లైన్ ఉంది. మిగిలిన 20 మీటర్ల పైపు కోసం గత వారం రోజులుగా పైప్లైన్ పనులు పూర్తి కావడం లేదు.

దీంతో మూడు గ్రామాల ప్రజలకు భగీరథ మంచినీటి సరఫరా కావటం లేదు. వెంచర్‌లో ఉన్న పైప్ లైన్ తొలగిస్తే ఆ పైప్ లైన్ రోడ్డు పక్కన వేసేందుకు సరిపోతుందా..? లేదా..? అని అధికారులు పరిశీలిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అధికారులు ముందస్తుగా పరిశీలన చేస్తే అదనంగా 20 మీటర్ల పైపు అవసరమవుతుందని తెలిసేది. అదనంగా అవసరమవుతున్న 20 మీటర్ల పైపు వచ్చిన తర్వాతే పైప్ లైన్ మారిస్తే ఒకటి రెండు రోజుల్లో పైప్ లైన్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవి. వారం రోజులుగా 20 మీటర్ల పైపు కోసం మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆ మూడు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News