మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెక్యూరిటీని తగ్గించారు.
దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిత్వరలోనే అధికార పార్టీని వీడడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనను పార్టీ అధిష్టానం కొంత కాలంగా దూరం పెడుతున్న విషయం తెలిసిందే. పార్టీలోని కొంతమంది పొంగులేటిని టార్గెట్ చేసుకుని అనేక వ్యాఖ్యలు చేస్తున్న విషయం కూడా విధితమే. దీనికి తోడు తాజాగా బుధవారం ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించి వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొంగులేటికి ప్రభుత్వం తరఫున 3+3 సెక్యూరిటీ ఉండేది. దాన్ని 2+2కు కుదించడమే కాకుండా పైలెట్ వెహికిల్ ను కూడా తొలగించారు. అయితే పొంగులేటి మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక పొంగులేటి త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతోనే పార్టీ తరఫు సెక్యూరిటీని తగ్గించినట్లు సమాచారం. అయితే శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీకి సంబంధించి మంగళవారమే కొన్ని పోస్టులు వైరల్ కాగా.. బుధవారం తగ్గించినట్లు అధికారిక ప్రకటన విడుదల కావడం విశేషం.