విద్యుత్ శాఖలో ఫోర్ మెన్ లీలలు..

వైరా విద్యుత్ శాఖలో అధికారులతో పాటు ఓఎండీ స్టాఫ్ లీలలు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2023-05-15 13:08 GMT

దిశ, వైరా : వైరా విద్యుత్ శాఖలో అధికారులతో పాటు ఓఎండీ స్టాఫ్ లీలలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరా విద్యుత్ శాఖలో అవకతవకలు, అక్రమాలను దిశ దినపత్రిక అనేక కథనాల్లో బహిర్గతం చేసినప్పటికీ సదరు శాఖలో పనిచేసే ఉద్యోగులకు కనీస భయం లేకుండా పోతుంది. విధులకు రాకుండానే అటెండెన్స్ రిజిస్టర్ లో ఫోర్ మెన్ బరితెగించి సంతకాలు పెట్టుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. ఫోర్మెన్ విధులకు రాకుండానే సంతకం పెట్టిన విషయం తెలిసినా ఏడీ కూడా కనీసం తప్పు చేసిన అతనిని ప్రశ్నించటం దేవుడెరుగు.. వెనకేసుకొని రావటం ప్రస్తుతం విద్యుత్ శాఖలో తీవ్ర చర్చనియాంశంగా మారింది. ఎన్పీడీసీఎల్ నుంచి నెలకు లక్షన్నర రూపాయలు పైగా జీతం తీసుకుంటున్న ఫోర్ మెన్ విధులకు హాజరు కాకుండానే ఒకేరోజు వారం రోజుల సంతకాలు రిజిస్టర్లో పెట్టటం విశేషం. ఈ వ్యవహారం అంతా తెలిసినా.. కనీసం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలువిమర్శలకు దారితీస్తుంది.

వారం రోజుల సంతకాలు ఒకేరోజు చేసిన వైనం..

వైరా విద్యుత్ శాఖలో ఫోర్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆదివారం తన విధులకు హాజరు కాలేదు. ఈ విషయం పై ఆదివారం మధ్యాహ్నం దిశ వైరా ఏడి రామకృష్ణను వివరణ కోరింది. ఫోర్ మెన్ వివాహానికి వెళ్లారని అందుకే ఆదివారం తన విధులకు హాజరు కాలేదని ఆయన స్పష్టం చేశారు. సెలవు పెట్టారా అని ఏడిని ప్రశ్నించగా ఆ సమాచారం ఏఈ వద్ద ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఈ కూడా సెలవులో ఉన్నారు కదా...? సెలవు కావాలని ఏ అధికారిని ఫోర్ మెన్ అడిగి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించగా.. ఫోర్మెన్ సెలవు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని ఆయనను వెనకేసుకొచ్చారు. దీంతో అసలు ఓఎండి స్టాప్ ఎవరెవరు హాజరయ్యారు అనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించిన దిశకు పలు విషయాలు బహిర్గతమయ్యాయి. సబ్ స్టేషన్ లోని అటెండెన్స్ రిజిస్టర్ లో ఈ నెల ఏడో తేదీ వరకే ఫోర్ మెన్ సంతకాలు పెట్టారు.

ఎనిమిదో తేదీ నుంచి అటెండెన్స్ రిజిస్టర్ ఆయన సంతకాలే లేకపోవడం విశేషం. ఆదివారం ఆయన విధులకు హాజరు కాని విషయంతో పాటు వారం రోజులుగా రిజిస్టర్లో సంతకాలు పెట్టని ఫోర్ మెన్.. విధులకు హాజరవుతున్నారా లేదా అని డీఈ ను దిశ ప్రశ్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫోర్ మెన్ శ్రీనివాసరావు ఆదివారం రాత్రి 7:30 గంటలకు హడావుడిగా ఖమ్మం నుంచి సబ్స్టేషన్కు వచ్చి వారం రోజుల సంతకాలు ఒకేసారి పెట్టి వెళ్లిపోయారు. ఆదివారం అసలు విధులకు హాజరు కాని ఆయన ఆదివారం కూడా విధులకు హాజరైనట్లు రిజిస్టర్లో సంతకం చేశారు. ఓఎండి స్టాప్ తో పాటు ఏడితో సహ ఆదివారం ఫోర్ మెన్ వైరాకు రాలేదని వివాహానికి వెళ్లాడని స్పష్టం చేశారు. విధులకు రాకుండానే ఆదివారము కూడా ఫోర్మెన్ హాజరు పట్టికలో సంతకం పెట్టిన విషయం తెలిసిన ఉన్నతాధికారులు కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడం విశేషం.

ఖమ్మంలో నివాసముంటున్న ఆయన ఇటీవల వైరాలో విచారణ నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు వైరాలోనే నివాసం ఉంటున్నానని ఓ ఇంటి నెంబర్ను విచారణ అధికారులకు చెప్పి వారిని కూడా తప్పుదోవ పట్టించటం విశేషం. వారం రోజులపాటు రిజిస్టర్ లో సంతకం చేయని ఆధారాలు దిశకు చిక్కటంతో ఓ అధికారి అండతో ఫోర్ మెన్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు సబ్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయటం విద్యుత్ శాఖ పనితీరును స్పష్టం చేస్తుంది. నెలకు ఇంటి అద్దెను వేలాది రూపాయలు ఎన్పీడీసీఎల్ నుంచి పొందుతున్న ఫోర్ మెన్ లోకల్ గా ఉండకుండా ఖమ్మంలో ఉంటున్నా ఎన్పీడీసీఎల్ అధికారుల "కళ్ళుండి కబోదుల్లా" వ్యవహరిస్తున్నారు.

అస్తవ్యస్తంగా తయారైన వైరా విద్యుత్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేయకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తుంది. విధులకు రాకుండా విధులకు వచ్చినట్లు రిజిస్టర్లో సంతకాలు చేసి ఎన్పీడీసీఎల్ నగదను జీతం రూపంలో తీసుకుంటున్న ఫోర్ మెన్ కు ఓ అధికారి అండగా ఉండటం ప్రస్తుతం చర్చనియాంశమైంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విధులకు హాజరుకాకుండా రిజిస్టర్లో రాత్రి వేళలో సంతకం పెట్టి ఖమ్మంలో నివాసముంటున్న ఫోర్ మెన్ పై చర్యలు తీసుకుంటారో.. లేదో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News