అంతా అధికారుల కనుసన్నల్లోనే.....

వైరా రిజర్వాయర్ కుడి కాలువ హెడ్ స్లూయిస్ సమీపంలో నీటిపారుదల శాఖ ఎన్ఓసీ లేకుండా, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా జెట్ స్పీడ్‌లో అక్రమ భవన నిర్మాణం కొనసాగుతోంది.

Update: 2024-03-18 11:48 GMT

దిశ, వైరా : వైరా రిజర్వాయర్ కుడి కాలువ హెడ్ స్లూయిస్ సమీపంలో నీటిపారుదల శాఖ ఎన్ఓసీ లేకుండా, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా జెట్ స్పీడ్‌లో అక్రమ భవన నిర్మాణం కొనసాగుతోంది. మున్సిపాలిటీ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ భవన నిర్మాణం కొనసాగుతున్నట్లు బహిరంగంగానే చర్చలు వినిపిస్తున్నాయి. ఈ భవన నిర్మాణం పై దిశ దిన పత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమైన వైరా మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ భవనానికి చుట్టూ పరదాలను కట్టి రాత్రింబవళ్లు భవన నిర్మాణ పనులను చేపడుతున్నారు. అయితే మున్సిపాలిటీ అధికారులకు ఈ పట్టలను కూడా తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గత నెల రోజుల క్రితం ఈ అక్రమ భవన నిర్మాణం పై దిశలో వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ భవనానికి రంగులు వేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వైరా రిజర్వాయర్ శిఖం భూమిలో అక్రమ భవనం నిరాటంకంగా నిర్మిస్తున్న అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారే తప్ప కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఈ భవన నిర్మాణంలో ఓ ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషిస్తున్నారని వైరాలో తీవ్ర ప్రచారం జరుగుతుంది.

రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

వైరాలో రెండు శాఖల అధికారులు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ అక్రమ భవన నిర్మాణాన్ని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఈ భవన నిర్మాణం కొనసాగుతుంది. వైరా మున్సిపాలిటీ అధికారులు కనీస అనుమతులు లేకపోయినా ఈ భవనం వైపు కన్నెత్తి చూడటం లేదు. మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం పనిచేస్తుందా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నీటిపారుదల శాఖకు సంబంధించిన శిఖం భూమిలో అక్రమ భవన నిర్మాణం జరుగుతుంటే తామేం చేస్తామని మున్సిపాలిటీ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మున్సిపాలిటీ అనుమతులు, నీటిపారుదల శాఖ ఎన్ఓసి లేకుండా అక్రమంగా భవన నిర్మిస్తుంటే మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా గత నెల రోజులుగా ఈ రెండు శాఖల అధికారులు తప్పిదాన్ని ఒకరిపై మరొకరు వేసుకుంటూ పరోక్షంగా భవన నిర్మాణాన్ని సహకరిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు అందిన కాడికి దండుకొని ఈ అక్రమ భవన నిర్మాణానికి అండగా నిలుస్తున్నారని వైరాలో ప్రచారం జరుగుతుంది. నెల రోజులుగా ఇంటి చుట్టూ పరదాలు కట్టి రాత్రింబవళ్లు పనిచేస్తున్నా మున్సిపాలిటీ అధికారులు కనీసం చలనం లేదంటే ఆ శాఖ అధికారులు ఏ స్థాయిలో పొల్యూట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి కనీస అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ భవన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News