మధిర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మధిర నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు.
దిశ, మధిర : మధిర నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ కమిటీని రూపొందించడానికి అఖిలపక్ష నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి వారితో సుదీర్ఘంగా గంటన్నర పాటు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి పార్టీల వారీగా ప్రతిపక్ష నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మధిర పట్టణ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు వేసి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు. మధిర నుంచి అంబారుపేట మీదుగా విజయవాడ కు, విజయవాడ నుండి అంబారుపేట మీదుగా హైదరాబాద్ కు వాహనాల రాకపోకలు పెరిగిన క్రమంలో చెరువు కట్టను విస్తరించి కట్ట పైన రోడ్డు వెడల్పు చేయడానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మధిర పట్టణంలో గత కొంత కాలం నుంచి వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా, వారు వ్యాపారం చేసుకోవడానికి రోడ్డు పక్కన స్థలాన్ని కేటాయించి అక్కడ వారి వ్యాపారం సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
మధిర పట్టణంలో కొద్దిపాటి వర్షం కురిస్తేనే రోడ్డు పైకి మురుగు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు , పాదచారులు నడిచేందుకు ఇబ్బంది ఉందన్నారు. సైడ్ కాల్వలు సరిగా లేకపోవడంతో కాల్వల నుండి దుర్గంధం వ్యాపించడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారన్నారు. మండల కేంద్రంలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని జాలిముడి, కట్టలేరు, పండ్రేగుపల్లి సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, లెఫ్ట్, రైట్ కెనాల్స్ పనులను పూర్తి చేయించి మరింత ఆయకట్టును సాగులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాను కృషి చేస్తానని, అభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తర్వాత తనకు అభివృద్ధి ముఖ్యమన్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మధిర నియోజకవర్గ అభివృద్ధికి కీలక సూచనలు చేశారు. మధిరను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని, మధిరలో పలు రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకోవాలని, డిపోలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు స్టాఫ్ నియామకం చేపట్టాలని, ప్రయాణికుల కొరకు బస్ స్టాప్ ల వద్ద షెల్టర్లు ఏర్పాటు చేయాలని, పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్, పట్టణంలో ధర్నా చౌక్ స్థలం కేటాయించాలని కోరారు. ఆర్వీ కాంప్లెక్స్ సమీపంలోనే రైల్వే గేటు మూసి వేయడంతో ప్రజలు అటువైపు నుండి ఇటు వైపునకు ఇటువైపు నుండి అటువైపునకు వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ట్రాక్ దాటాల్సి వస్తుందని , కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని , రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని,
మడుపల్లి గ్రామ సమీపంలోని లెదర్ పార్క్ ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరా నుంచి ఎర్రుపాలెం వరకు డబుల్ రోడ్డు వేయించాలని, మధిర పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని , పంప్ హౌస్ వద్ద ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి మీదుగా తాళ్లూరు ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, శివాలయం వద్ద బ్రిడ్జి నిర్మాణం ( లో వంతెన ) ఏర్పాటు చేయాలని, తహసీల్దార్ కార్యాలయం పక్కన మెయిన్ రోడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని కోరారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరగా కావలసిన యాక్షన్ ప్లాన్
తాను రెడీ చేయిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులకు వివరించారు. అఖిలపక్ష నాయకులు ఇచ్చిన సలహాలు సూచనలతో పాటు నియోజకవర్గంలో ఇందిరమ్మ డైరీ ఏర్పాటు చేసి ఉపాధికి బాటలు వేయనున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యా లత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, నాయకులు మల్లాది హనుమంతరావు, మార్నేటి పుల్లారావు, బీజేపీ నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, పాపట్ల రమేష్, సీపీఐ నాయకులు బెజవాడ రవి, సీపీఎం నాయకులు శీలం నరసింహారావు, మంద సైదులు తదితరులు పాల్గొన్నారు.