కేసులు పెట్టినా.. ఆగని సెల్ టవర్ నిర్మాణం

Update: 2024-08-28 13:46 GMT

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నా సెల్ టవర్ నిర్మాణ పనులు ఆగటం లేదు. కనీస అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. సుమారు 6 నెలల క్రితం ఈ సెల్ టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే అప్పట్లో స్థానికులు జిల్లా కలెక్టర్ తో పాటు వైరా మున్సిపాలిటీ అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేశారు. అనంతరం సెల్ టవర్ నిర్మాణం చేపట్టే ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేశారు. ఈ సెల్ టవర్ నిర్మాణం చేపడితే తమ ఆరోగ్యాలు రేడియేషన్ వల్ల దెబ్బతింటాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వైరా మున్సిపాలిటీతో పాటు ఇతర ఏ అనుమతులు లేకుండా అక్రమంగా సెల్ టవర్ నిర్మిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆరు నెలల తర్వాత ఆగ మేఘాల మీద ఈ పనులు చేపడుతున్నా అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 24వ తేదీన అనుమతులు లేకుండా చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. గత వారం రోజులుగా సెల్ టవర్ నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే ఆపుతారో లేదంటే ఇదంతా వారికి "మామూలే"అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.


Similar News