ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: అదనపు కలెక్టర్ స్నేహలత
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాల మెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు.
దిశ, ఖమ్మం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాల మెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. మంగళవారం ఆమె ఖమ్మం రూరల్ మండల పరిధలోని చిన్నవెంకటగిరి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు అమలుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, వారికి చదవడం, రాయడం సులభతరం చేసేలా తొలిమెట్టు కార్యక్రమం చేపట్టిన్నట్లు ఆమె తెలిపారు.
ప్రతి నెలా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, ఫలితాల ఆధారంగానే బోధన చేపట్టాలని ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విద్యా సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని పేర్కొన్నారు. అనంతరం సైన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నారులు చేసిన ప్రయోగాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని, వారిని ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఎంపీడీవో అశోక్, ఎంపీవో శ్రీనివాసరావు, పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.