విద్య, వైద్యానికి పెద్దపీట

విద్య, వైద్యం, ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-24 09:03 GMT

దిశ, కూసుమంచి : విద్య, వైద్యం, ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాల తరగతి గదులను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 637 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి స్కూల్ తెరిచిన రోజే పుస్తకాలు,దుస్తులు ఇచ్చిందని, అలాగే వైద్యం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గత ప్రభుత్వంలో రూ.ఐదు లక్షలు మాత్రమే అందించగా నేడు పది లక్షలకు పెంచినట్టు చెప్పారు. భవిష్యత్ లో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఖమ్మం జిల్లాలోనే కూసుమంచి కాలేజీని సిబ్బంది ఉత్తమంగా తీర్చిదిద్దాలని కోరారు.

    కూసుమంచి కళాశాలను రాష్ట్రంలోనే టాప్ 3 కాలేజీల్లో ఒకటిగా ఉంచాలని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి సదుపాయం కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంసెట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం కళాశాల, పాఠశాల విద్యార్థినులకు పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, వివిధ శాఖల అధికారులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, జొన్నలగడ్డ రవికుమార్, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News