కబ్జాచేసిన ఏ ఒక్కరినీ వదలం

కబ్జాలు, అక్రమాలు చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

Update: 2024-09-25 10:23 GMT

దిశ, ఖమ్మం : కబ్జాలు, అక్రమాలు చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ లోని శ్రీ రామ్ నగర్ లో డ్రైనేజీకి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంను పాలించిన గత పాలకులు, అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. కబ్జాలతో, అక్రమాలతో, బెదిరింపులతో ఖమ్మంను అతలాకుతలం చేశారని గుర్తు చేశారు. ప్రజాలకోసం ఖర్చు పెట్టే ప్రతిపైసా ప్రజలకే ఉపయోగపడే విధంగా పనులు జరగాలని సూచించారు. గతంలో పచ్చదనం కోసం పిచ్చిమొక్కలు నాటారని, శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని మళ్లీ ఇప్పుడు నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఆ పిచ్చి మొక్కలను రూ. 10 కు కొనుగోలు చేసి రూ.100 బిల్లులు డ్రా చేసుకున్నారని విమర్శించారు.

    ఖమ్మం నగరంలో రోడ్లు ఆక్రమించి షెడ్లు, ఇళ్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని మంత్రి అధికారులకు చురకలు అంటించారు. నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయారా..? అని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చి ఇళ్లు మునిగిపోయాయని, అప్పుడు ఉన్న అధికారులు సరిగా పనిచేసి ఉంటే ఈరోజు ఇలాంటి నింద వచ్చేదా అని అన్నారు. కార్పొరేటర్లు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కొంతమంది నగరంలో అక్రమంగా లాక్కున్న స్థలాలను బరాబర్ గా వెనక్కి తీసుకుంటానని హెచ్చరించారు.

    ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఎవరో కబ్జా చేశారని తెలిసిందని, వాటిపై రేపు అధికారులను పంపించి హద్దులు పెట్టిస్తానన్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు పరీవాహక ప్రాంతంలో వచ్చిన వరదల్లో మునిగిన బాధితులకు పక్కాగా ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం ఖిల్లాపై రోప్ వే ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాంతో పాటు వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను ఖమ్మంకు టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ నీరజ, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News