గీతకార్మికులకు కాటమయ్య రక్షక కవచ కిట్లు పంపిణీ
గీతకార్మికులకు కాటమయ్య రక్షక కవచ కిట్లను అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ, ఖమ్మం : గీతకార్మికులకు కాటమయ్య రక్షక కవచ కిట్లను అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్డులో రూ. 2 కోట్లతో చేపట్టిన వాటర్ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం హైదరాబాద్ శాఖ సహకారంతో 100 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం భద్రత కిట్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాటమయ్య రక్షక కవచం కిట్ల వల్ల కల్లు గీత కార్మికులు చెట్లపైకి వెళ్లినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని, వీటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్లుగీత కార్మిక సొసైటీ పరిధిలోని చెట్లపైకి ఎక్కే గీత కార్మికులందరినీ గుర్తించి వారికి రక్షక కవచ కిట్లను అందజేస్తామని తెలిపారు. కాటమయ్య రక్షక కవచం కిట్లను అందజేసిన గీత కార్మికులు వాటిని వినియోగిస్తున్నారా లేదా చూడాలని, ఈ కిట్ల వినియోగం వల్ల కలిగే లాభాలను ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఖమ్మం నగరంలో ఎక్సైజ్ శాఖ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. వైన్ షాప్ పర్మిట్ రూమ్, బార్లను రెగ్యూలర్ గా చెక్ చేయాలని, దేవాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద మద్యం దుకాణాలు ఉండకుండా చూడాలని కోరారు.
మార్కెట్ యార్డు పరిశీలన..
ఖమ్మం మార్కెట్ యార్డులోని పెసర్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. క్వింటాల్ పెసర్లకు ప్రభుత్వం 8682 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా, ఖమ్మం మార్కెట్ యార్డులలో 2 పెసర్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 391 మంది రైతుల నుంచి 4292 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్టు జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్ మంత్రికి తెలిపారు.
అనంతరం మంత్రి ఇటీవల వరదతో దెబ్బతిన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరమేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, కార్పొరేటర్ లు, ఎక్సైజ్, ఆర్అండ్ బీ, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.