Disha Effect : దిశ ఎఫెక్ట్...అక్రమ వసూళ్లు అరికట్టేందుకు ప్రత్యేక స్కాడ్

వైరా మండలంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు విక్రయించి అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్కాడ్ ను ఏర్పాటు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ స్పష్టం చేశారు.

Update: 2024-08-01 14:58 GMT

దిశ, వైరా : వైరా మండలంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు విక్రయించి అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్కాడ్ ను ఏర్పాటు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ స్పష్టం చేశారు. వైరా మండలంలో గ్యాస్ సిలిండర్లకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్న విషయమై దిశ దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అక్రమ వసూళ్లను అరికట్టాలని డీఎస్ఓను ఆదేశించారు. డీఎస్ఓ గురువారం సాయంత్రం ఖమ్మం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వైరా మండలానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న పలు కంపెనీలకు చెందిన పదిమంది డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సిలిండర్ ను వైరా పట్టణంలో ఎమ్మార్పీ కంటే 20 రూపాయల అదనంగా

    విక్రయిస్తున్నట్లు ఓ డీలర్ అంగీకరించటం విశేషం. అంతేకాకుండా బుధవారం సదరు డీలర్ వైరాలో 900 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను విక్రయిస్తున్నట్లు డీఎస్ఓకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో అధిక నగదు వసూలు చేస్తున్న డీలర్ల పై డీఎస్ఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న డీలర్లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమించి ఇష్టానుసారంగా గ్యాస్ ఏజెన్సీ నడిపితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

     వైరా మండలంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు ప్రత్యేక స్కాడ్ గ్యాస్ సిలిండర్ల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ డీటీ రామచంద్రయ్య గ్యాస్ సిలిండర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తనకు ఫోన్లో ఫిర్యాదు చేసిన వినియోగదారుల వివరాలను సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం డీలర్ల నుంచి ఎమ్మార్పీ ధరలకు గ్యాస్ విక్రయిస్తామని, లేనిపక్షంలో పౌరసరఫరాల శాఖ తీసుకునే చర్యలకు తాము బాధ్యత వహిస్తామని హామీ పత్రాలు రాయించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఆర్ ఐ కిరణ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News