వైకుంఠధామంలో చీకటి దందా..! టేకు చెట్లపై గొడ్డలి వేటు

ఓ వైపు ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలని అందుకు విస్తృతంగా చెట్లు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అది సాధ్యం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Update: 2024-10-04 02:23 GMT

దిశ, కొత్తగూడెం రూరల్: ఓ వైపు ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలని అందుకు విస్తృతంగా చెట్లు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అది సాధ్యం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫారెస్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే భారీగా పెరిగిన టేకు వృక్షాలు నరికివేతకు గురి కావడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు పక్కన ఉన్న మున్సిపల్ వైకుంఠధామంలో ఉన్న టేకు చెట్లు గొడ్డలి వేటుకు గురయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో నాటిన టేకు చెట్లు దశలవారీగా అవి పెద్దగా పెరిగి నీడని ఇవ్వడంతో పాటు చల్లటి వాతావరణాన్ని ఇచ్చే వృక్షాలు నరికివేతకు గురి కావడం గమనార్హం. రాత్రి సమయంలో కటింగ్ మిషన్ ద్వారా టేకు చెట్లను కోసి, వాటిని సైజులుగా తయారు చేసి, వాహనాల ద్వారా కలప మిల్లుకు తరలిస్తున్నట్లుగా సమాచారం. సైజులుగా కోసిన తర్వాత చివరి కొమ్మలు అడ్డదిడ్డంగా వేయడంతో వైకుంఠధామం అసౌకర్యానికి నిలయంగా నిలిచింది. ఫారెస్ట్ శాఖ పర్యవేక్షణ లేని కారణంగానే టేకు చెట్లు నరికివేతకు గురికాబడి చీకటి దందా నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ కార్యాలయానికి అతి సమీపంలో టేకు చెట్ల దందా కొనసాగడం పట్ల విమర్శలకు తావిస్తుంది.

కలప దందా వెనక గులాబీ నేతల హస్తం?

రామవరం గోధుమ వాగు వైకుంఠధామంలో రాత్రి సమయంలో జరుగుతున్న కలప దందా వెనక కొందరి బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రూ.లక్షలు విలువ చేసే కలప నరికివేతకు గురి కావడం బాధాకరమని పర్యావరణ పరిరక్షణ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేకు చెట్లు నరికివేత రవాణాపై ఫారెస్ట్ శాఖకు తెలిసి జరుగుతుందా.. తెలియక జరుగుతుందా.. అనే విషయమై జిల్లా కేంద్రంలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ విలువైన టేకు చెట్లు నరికివేత కలప తరలింపు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టేకు చెట్లు నరకడం బాధాకరం

రామవరం గోధుమ వాగు వైకుంఠధామంలో పెరిగిన టేకు చెట్లు మాఫియా చేతుల్లో నరకడం బాధాకరం. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి. నీడనిచ్చే చెట్లను నరికి వాటితో వ్యాపారం చేయడం విచారకరం. ఫారెస్ట్ అధికారులు కలప మాఫియాపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. -సనప కోటేశ్వరరావు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

వైకుంఠధామంలో టేకు చెట్ల నరికివేత గురైన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. టేకు చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతులు లేవు. అటవీ సంపదను కాపాడడమే లక్ష్యంగా ముందుకు పోతాం. చెట్ల సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. - శ్రీనివాసరావు, రేంజ్ ఆఫీసర్ 


Similar News