ఆ 6 సీట్ల పైనే కమ్యూనిస్టుల గురి!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ 6 ఎమ్మెల్యేల స్థానాలపైనే కమ్యూనిస్టు పార్టీలు ఫోకస్ పెట్టాయి.
దిశ, వైరా : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడంతో ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టింది. పొంగులేటికి షాక్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ అధిష్టానం ఎంత ఫోకస్ పెట్టినప్పటికీ కమ్యూనిస్టుల పొత్తులతో ఆ పార్టీపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు పార్టీకి పొంగులేటి దూరం కావటం, మరోవైపు కమ్యూనిస్టులకు పొత్తుల్లో జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే ఆయా నియోజకవర్గంల్లోని బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లటం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్లు ఆశించే ఆశావాహులు అనేక మంది ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోని ఆశావాహులను బీఆర్ఎస్ నిలవరించడంతో పాటు కామ్రేడ్లకు కేటాయించే సీట్లలో బీఆర్ఎస్ నేతలందరికి సర్ది చెప్పటం అధిష్టానానికి కత్తి మీద సాము లాంటిదే. ఈ అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల బరిలో దిగటంతోనే చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
కమ్యూనిస్టులతో అక్కడ పొత్తు లేకుంటే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండేదని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ కు పొత్తు ఉంటుందని స్పష్టమవుతోంది. జాతీయ రాజకీయాలకు వెళ్లిన కేసీఆర్ కు తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులతో పొత్తు అనివార్యం కానుంది. బీఆర్ఎస్ కమ్యూనిస్టుల మధ్య సాధారణ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే కమ్యూనిస్టులు తమకు ప్రాబల్యం ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో అధిక సీట్లు అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఖమ్మం ఎంపీ స్థానాన్ని కామ్రేడ్లు పొత్తుల్లో తమకు ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితిలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం, సీపీఐ నేతలు మొత్తం ఆరు నియోజకవర్గాలపై ఇప్పటికే గురి పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కామ్రేడ్లకు సీట్ల కేటాయిస్తే ఆ పార్టీలోని ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆశావాహుల రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే కారు గుర్తుపై విజయం సాధించారు. 2018లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి 1, టీఆర్ఎస్ 1 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వైరా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 8 కి చేరుకుంది. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరటంతో పాటు గతంలో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు, ఆశావాహులతో ఇప్పటికే కారు కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులకు జిల్లాలో సీట్లు కేటాయిస్తే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఆశావాహులు రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలకు వెళ్ళటం ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.
ఆ ఆరు నియోజకవర్గాలే సంకటం
కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 సీట్లలో పోటీ చేసేందుకు ఊవిళ్లూరుతున్నారు. ఇప్పటికే పాలేరు నుంచి తాము పోటీ చేయటం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఇక్కడ సీపీఎం పోటీ చేస్తే టిఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. గతంలో తమకు బలం ఉన్న మదిర, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎం పొత్తుల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మధిర నుంచి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, బొమ్మెర రామ్మూర్తి, భద్రాచలం నుంచి బీఆర్ఎస్ నాయకులు తెల్లం వెంకట్రావు, మానే రామకృష్ణ రావు, బోదెపోయిన పిచ్చయ్యల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీపీఐ గతంలో పోటీ చేసి విజయం సాధించిన కొత్తగూడెం వైరాతో పాటు ఇల్లందు నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా ఆశించే అవకాశం ఉంది. సీపీఐ బీఆర్ఎస్ పొత్తుల్లో ఈ సీట్లలో పోటీ చేస్తే వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్, వైరా మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్, బానోత్ చంద్రావతి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఆశావాహుడు గడల శ్రీనివాసరావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పొత్తుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు కనీసం నాలుగు సీట్లు కామ్రేడ్ లకు కేటాయించాల్సిన రావడం బీఆర్ఎస్ కు తప్పని పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ కు రెండు సీపీఎం కు రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించినా ఆ నాలుగు స్థానాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు టిఆర్ఎస్ పార్టీని వీడి ఎన్నికల్లో తమకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించే రాజకీయ పార్టీలోకి జంపు కావటం అనివార్యమవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇతర పార్టీలకు లాభం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం ఎంపీ స్థానానికి వస్తే గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేశారు. ఈసారి పొత్తుల్లో ఎంపీ స్థానం కోసం సీపీఐ, సీపీఎం పట్టుపడితే బీఆర్ఎస్ ఆ పార్టీలకు ఎంపీ స్థానం కేటాయిస్తుందో లేదో అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత రంజుగా ఉండే అవకాశం ఉంది.