విలేఖరిపై ఇసుక మాఫియా దాడి.. స్పందించిన కాంగ్రెస్ నేతలు

Update: 2022-02-25 07:30 GMT

దిశ, కరకగూడెం: ఇసుక మాఫియా రెచ్చిపోయి విలేకర్లపై బినామీ కాంట్రాక్లర్లు దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కరకగూడెం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం పినపాక మండలం, జానంపేట గ్రామ పంచాయతీలోని ముకుందాపురం గ్రామంలో అక్రమ గ్రావెల్ తోలకాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో వార్త సేకరణ కోసం వెళ్లిన విలేకరి సలుగు  బిక్షపతిపై బినామీ కాంట్రాక్టర్లు దాడి చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో ఇసుక దొంగ రవాణా చేస్తున్న ఇసుక మాఫియా దొంగల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఇటువంటి దాడులు చేస్తున్న వారినీ కఠినంగా శిక్షించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. నియోజకవర్గంలో ఈ విధంగా నడుస్తున్న ఇసుక ర్యాంపులను పరిశీలించి వాటిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దాడికి గురైన విలేకరి సలుగు బిక్షపతికి న్యాయం జరిగే విధంగా చూడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల బీసీ సెల్ అధ్యక్షులు బైరిశెట్టి రామరావు,మండల కార్యదర్శి షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News