ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారికే ఇందిరమ్మ ఇళ్లు : ఎండీ గౌతమ్

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని దగా చేసే మధ్య దళారులను

Update: 2024-12-28 15:13 GMT

దిశ,భద్రాచలం : ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని దగా చేసే మధ్య దళారులను నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. శనివారం నాడు దుమ్ముగూడెం మండలంలోని డి. కొత్తగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు చేసుకున్న గ్రామస్తులతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేపై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలని, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే గ్రామస్తులు తప్పనిసరిగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సర్వేకు వచ్చే అధికారులకు అందించి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుని తప్పులు లేకుండా దరఖాస్తులు అందించాలని అన్నారు. సంబంధిత సర్వే అధికారులు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు వారికి అప్పగించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు లాగిన్లు రూపొందించుకోవాలని అన్నారు.

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు వారి దరఖాస్తు ద్వారా వారి ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతులు పూర్తిస్థాయిలో తెలిసేలా ఫోటో యాప్ లో అప్లోడ్ చేసి డాక్యుమెంటేషన్ ప్రకారము యాప్ లో ప్రతి కాలం సరిగ్గా పూరించి ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలని, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ చేసిన వివరాలు వారికి తెలియజేయాలని ఆయన అన్నారు. సర్వే అధికారులు తప్పనిసరిగా అర్హులైన ప్రతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీ ఓ రామకృష్ణ, హౌసింగ్ పీడీ శంకర్, వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News