బొగ్గు వేలం పాటను నిలిపివేయాలి

బొగ్గు వేలం పాటను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ప్ల కార్డులు చేతబోని నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-06-28 11:10 GMT

దిశ, భద్రాచలం టౌన్ : బొగ్గు వేలం పాటను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ప్ల కార్డులు చేతబోని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ బొగ్గు బావులను వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తున్నదని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో పాటు వేలంపాటలు పోటీ పడాలని అనుకోవటం సరైనది కాదని వారు అన్నారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వమే నిర్వహించాలని

    వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వారి ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగానే బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు వేలం పాటను నిర్వహించటం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు ఈ వేలం పాటను వ్యతిరేకిస్తున్నట్లు మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని ఈ పద్ధతి సరి కాదని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో దేశంలోని ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోందని, ఇది దారుణమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని తిరస్కరించిన బుద్ధి రాలేదని వారు అన్నారు.

    సింగరేణి బొగ్గు బావులను వేలంపాట వేయడం ద్వారా మొత్తం బొగ్గు సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుంటుందని ఈ ప్రమాదాన్ని దేశ ప్రజలు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకట రామారావు, సున్నం గంగా, పట్టణ కమిటీ సభ్యులు డి. సీతాలక్ష్మి, ఎన్ .నాగరాజు, జీవనజ్యోతి, జీ.లక్ష్మి కాంత్, ఎస్.భూపేంద్ర, శాఖ కార్యదర్షులు డి.రామకృష్ణ, రాధా, జి.నాగలక్ష్మి, ధనలక్ష్మి, సక్కుబాయి, సీహెచ్.వెంకటరమణ, జానకమ్మ ,పిల్ల వెంకన్న ,సౌభాగ్యం, హలీమా తదితరులు పాల్గొన్నారు. 

Similar News