పోడు రైతులకు పట్టాలిచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు: కోనేరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ...BJP Leader Koneru hits out at CM KCR
దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మాట్లాడుతూ ఈనెల 26, 27 తేదీలలో కిసాన్ మోర్చా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక శిక్షణా తరగతులు కొత్తగూడెం పట్టణంలో కొత్తగూడెం క్లబ్ లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్రం నుంచి పలువురు రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులకు మరియు మండల నాయకులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయకుండా రైతులని మోసం చేసిందని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టి పంటలు నష్టం జరిగితే నష్టపరిహారం కోసం ఫసల్ భీమా పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు.
తెలంగాణలో పోడు భూములు సమస్య ఎక్కువగా ఉన్నది అందులో, భద్రాది కొత్తగూడెం జిల్లాలో మరింత పోడు భూముల సమస్య ఉన్నదని, 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తా అని చెప్పి ఇంతవరకు పరిష్కరించకపోవడం వల్ల పోడు భూముల రైతులు మరియు ఫారెస్ట్ అధికారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఈ జిల్లాలో హత్యకు గురికాబడ్డారని, ఫారెస్ట్ అధికారి హత్యగావించబడడం చాలా బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలి ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలిచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, , జిల్లా కోశాధికారి నున్న రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీష్, గిరిజన మోర్చా జిల్లా నాయకులు భూక్య శ్రీను, బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, సిరిపురపు గోపాల్ రావు, వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.