ఉత్తమ విద్యే ప్రభుత్వ లక్ష్యం

ఉత్తమ విద్యే ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

Update: 2024-10-11 13:13 GMT

దిశ, ఖమ్మం : ఉత్తమ విద్యే ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సమాజానికి కావలసిన అత్యంత ప్రాధాన్యత అంశం విద్య అని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భావిస్తున్నట్టు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా  ప్రభుత్వాలు విద్యపై శ్రద్ధ పెట్టకపోవడంతో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని ఆలోచించి అందుకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మానవజాతి పురోగతికి అవసరమైన విద్య, వైద్యం పకడ్బందీగా ఉండటం చాలా అవసరమని, దీనిని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు.

    అభివృద్ధి పరంగా మన దేశం కంటే చాలా దేశాలు ముందు ఉన్నాయని, వాటితో పోటీ పడాలంటే మన విద్యార్థులకు మంచి శిక్షణ కావాలని, అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల రూపకల్పన చేశామని అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో అరకొర వసతులతో పిల్లలు ఇబ్బంది పడ్డారని, ఆ పరిస్థితి మరోసారి రావద్దని ఒక్కొక్క పాఠశాలకు రూ. 300 నుంచి రూ. 350 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు. రాష్ట్రానికి ఆదర్శంగా రఘునాథ పాలెం మండలాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మండలంలో ప్రభుత్వ భూములు మార్క్ చేసి పెట్టుకోవాలని, ఇస్కాన్ పాఠశాల, కిచెన్, కృష్ణ దేవాలయం  ఏర్పాటు అవుతాయని తెలిపారు. స్వామి నారాయణ, సమీకృత విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు రఘునాథపాలెం మండలంలో ఏర్పాటు అయ్యాయని, ఇస్కాన్ సంస్థ కూడా ఈ మండలానికి వచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పిల్లలు చిన్న వయసులోనే గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారని, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలను కనిపెట్టుకొని ఉండాలని సూచించారు.

    బుగ్గవాగు నీళ్లు ఈ మండలానికి తేవడానికి కాలువల కోసం భూములు ఇస్తే తీసుకొని వస్తానని, లేకుంటే సాగర్ లిఫ్ట్ ద్వారా తెస్తానని అన్నారు.  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. వైద్య కళాశాలలో భూమి కోల్పోయిన రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఆదుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులో 3 పంటలు పండే ప్రాంతంగా రఘునాథపాలెం ఎదగాలని అన్నారు. సన్నాలు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించామని తెలిపారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాకు, రాష్ట్రానికి ఈ రోజు చారిత్రాత్మకం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి విద్య అందాలని ఆశిస్తారని, అది అందించేందుకు ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు దోహదపడతాయని తెలిపారు.

     ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కలిపి నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌలిక వసతులు, క్రీడా వసతులు, పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు సంవత్సర కాలంలో సివిల్ పనులు నాణ్యతతో పూర్తిచేసి విద్యార్థులకు వేగవంతంగా అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు.  ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ద్వారా అన్ని కులాలు, మతాల వారు కలిసి ఒకేచోట చదువుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.  దీని వల్ల అందరూ సామరస్యంగా బాగా చదివే అవకాశం ఉందని, దీని వల్ల ప్రతి వర్గానికి లాభం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, నగర కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News