ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అశ్వారావుపేట యువతి.. తిరిగితీసుకురావాలని తండ్రి వేడుకోలు

Update: 2022-02-25 06:13 GMT

దిశ, అశ్వారావుపేట: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధమే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చదువుకున్న అనేక మంది భారత విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎండీ గౌస్ కుమార్తె రజియా కూడా ఉంది. ఆమె వైద్య విద్య అభ్యసించేందుకు 2018లో ఉక్రెయిన్‌కు వెళ్ళింది. అక్కడ జఫ్రోజా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతోంది.

ప్రస్తుతం ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం ఉండడంతో అక్కడ ఉన్న కూతురి పరిస్థితిని తలుచుకుని తండ్రి గౌస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవని, ఇంకా రెండు రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉందని, అంచెలంచెలుగా నీటి సరఫరా కూడా నిలిచిపోతుందని ఉక్రెయిన్ నుంచి తన కూతురు ఫోన్ చేసి విలపిస్తూ, ఇండియాకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరిందని.. తన కూతురుతో పాటు మరో 500 మంది తెలుగువారు ఆ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తండ్రి గౌస్ తెలిపాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి తన కూతురిని ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు.



Tags:    

Similar News