56 ఏండ్ల తరువాత మధిరకు మంత్రి పదవి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో మధిర నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది.
దిశ, మధిర : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో మధిర నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. గురువారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన నూతన మంత్రివర్గ విస్తరణలో భాగంగా హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 56 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గ విస్తరణలో శీలం సిద్ధారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 56 సంవత్సరాల తర్వాత మధిరకు మల్లు భట్టి విక్రమార్క రూపంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వరించింది. 1952 లో ఏర్పడిన నియోజకవర్గం పీడీఎఫ్ పార్టీ గెలుపొందగా, 1957 ,1962 , 1967, 1972 ,1978 ,1983 జనరల్ కేటగిరీలో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.1985, 1989,1994, 1998 సీపీఎం పార్టీ అభ్యర్థులు గెలువగా, 1999 లో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా, 2004 లో సీపీఎం పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
రిజర్వేషన్ లో భాగంగా మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో 2009 నుండి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ క్యాటగిరిలో 2009, 2014, 2018, 2023 లో వరసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అత్యధిక మెజార్టీతో గెలపొందారు. మల్లు భట్టి విక్రమార్క 1990 నుండి 1992 వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, 2000 నుండి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా , ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్ గా (1994 - 2000) ఆరు సంవత్సరాలు పనిచేశారు. 2007 నుండి వరకు ఎంఎల్సీగా ఎన్నిక కాగా, 2009 మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా, 2011లో శాసనసభ ఉప సభాపతిగా, 2014 లో సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత 2015 న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష కార్యదర్శిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 న తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టిని ఎంపిక చేస్తూ ఏఐసీసీ ప్రకటించింది. మధిర నియోజకవర్గం నుండి శీలం సిద్దా రెడ్డి 1958, 1964, 1967 వరసగా మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండల కార్యదర్శిగా పనిచేశారు. 1967 లో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శీలం సిద్ధారెడ్డి గెలుపు పొందారు. ఆ తర్వాత వరుసగా సీపీఎం పార్టీ అభ్యర్థులు గెలుపొందిన వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు సీపీఎం, టీడీపీ పొత్తులలో భాగంగా 1999లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినా ఎటువంటి మంత్రి పదవి దక్కలేదు. సుదీర్ఘకాలం తర్వాత మధిర నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడంతో మధిర నియోజకవర్గ ప్రజల సంతోషానికి అవధులు లేవు. తొలి మంత్రివర్గ విస్తరణలోనే మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో మధిర రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.