KTR: అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు..హైకోర్టు కీలక నిర్ణయం
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (KTR Quash Petition) హైకోర్టు (High Court) తీర్పు రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. కేటీఆర్ తరపున వాదనలు ముగియగానే కోర్టు లంచ్ విరామం ప్రకటించింది. బ్రేక్ అనంతరం తిరిగి ప్రారంభమైన వాదనల్లో ఏసీబీ తరపున ఏజీ ఎ.సుధాకర్‌రెడ్డి, ఫిర్యాదుదారు దానకిశోర్ తరపున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆ ఇద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు?
ఏసీబీ (ACB) తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ- కార్ రేసింగ్ సీజన్-10 ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని, రూ.46 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించారని ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు ఏ దశలో ఉంది? అని కోర్టు ప్రశ్నించగా ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు దానకిశోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని చెప్పారు. ఈ కేసులో నిందితులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? వారిని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. బదులిచ్చిన ఏజీ నిందితులు పిటిషన్లు దాఖలు చేయలేదని, త్వరలోనే అన్ని ఆధారాలు ఇస్తామని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు చెప్పారు. 409 సెక్షన్ కేటీఆర్‌కు వర్తిస్తుందని పలు సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి బడ్జెట్ పేపర్ మీద సంతకం పెట్టినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు సేకరించారని కోర్టు అడుగగా కేసు విచారణ కొనసాగుతన్నదని అన్ని ఆధారాలు బయటపడతాయని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందన్న ఏజీ బిజినెస్ రూల్ కాపీ హైకోర్టుకు అందజేశారు.
కేటీఆర్ పర్యవేక్షణలోనే..: దానకిశోర్ తరఫు లాయర్
దానకిశోర్ (Dana Kishore) తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మంత్రి పర్యవేక్షణలోనే పురపాలకశాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని, రేసింగ్‌కు చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ అంశంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు.