కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు?

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం జరగ

Update: 2022-09-03 03:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం జరగనున్నది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు ఏయే అంశాలను చర్చించాలనే విషయమై మంత్రివర్గంలో చర్చ జరగనున్నట్లు ఇప్పటికే ప్రగతి భవన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. దీనికి తోడు రాష్ట్రానికి కేంద్రం నుంచి జరుగుతున్న అన్యాయం, విభజన చట్టం మేరకు హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయకపోవడం, విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశం, రిజర్వు బ్యాంకు రుణాల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ విధించిన ఆంక్షలు, పరిమితి పెంచాలంటూ గతంలో చేసిన విజ్ఞప్తి.. తదితర పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చకు రానున్నట్లు సమాచారం.

ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒక డీఏ (కరువుభత్యం) బకాయి ఉండగా కొత్తదానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తుందని ఎంప్లాయీస్ ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్ల పార్టీ అనుసరించాల్సిన వైఖరి, కేంద్రానికి వ్యతిరేకంగా చేయనున్న తీర్మానాలు తదితరాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. పార్టీ ఎంపీలతో పాటు పలువురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా పార్టీ నుంచి ఇప్పటికే ఇన్విటేషన్లు వెళ్ళాయి.

వరుస సమావేశాలపై సస్పెన్స్

ఒకే రోజున గంటల వ్యవధిలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, ఆ తర్వాత టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. అసెంబ్లీని రద్దు చేస్తారా? కొత్త పథకాలను ప్రకటిస్తారా? కేంద్రంపై పోరును ఉధృతం చేయనున్నట్లు వెల్లడిస్తారా? జాతీయ పార్టీని పెట్టనున్నట్లు క్లారిటీ ఇస్తారా? ఇక నుంచి నేషనల్ పాలిటిక్స్ లో టీఆర్ఎస్ పోషించనున్న పాత్ర గురించి వివరిస్తారా?.. ఇలాంటి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున రెండు సమావేశాలను ఏర్పాటు చేయడం వెనక కేసీఆర్ సంచలన ప్రకటనలు ఉండొచ్చన్న ఉత్కంఠ నెలకొన్నది. 2018లో అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తీసుకున్న సెప్టెంబరు 6ననే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం.

ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న సమయంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్‌ను ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవిక గణాంకాలతో తిప్పికొట్టడానికి కూడా కేసీఆర్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలువురు మంత్రులు చేసిన కామెంట్లకు రాష్ట్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఇకపైన కూడా వెంటవెంటనే ఘాటుగా బదులిచ్చే అంశంపై పార్టీ శ్రేణులను ఈ సమావేశం ద్వారా ఉత్సాహపరిచే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న తీర్మానాలు, ముఖ్యమంత్రి చేయనున్న ప్రకటనలు తదితరాలపై కూడా ఎల్పీ భేటీలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉన్నది.

ఈసారి వినూత్నంగా సెప్టెంబరు 17 వేడుకలు?

రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో సెప్టెంబరు 17న విమోచనా దినోత్సవం జరపనున్నట్లు టీఆర్ఎస్ హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలుచేయలేదు. ఇదే విషయాన్ని బీజేపీ ప్రతీ సంవత్సరం ప్రస్తావిస్తూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో సెప్టెంబరు 17 వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నది. నిజాం సంస్థానంలో పరిపాలన రాచరిక స్వభావంతో కూడుకుని ఉన్నందున 1948లో ప్రజాస్వామిక భారత్‌లో లాంఛనంగా విలీనమైన ఘట్టాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిర్వహించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య భారత్‌లో తెలంగాణ ఒక అంతర్భాగమై 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ చారిత్రక సందర్భాన్ని నిర్వహించాల్సిందిగా పలువురు మేధావుల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. అనేక రంగాల్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లుగానే సెప్టెంబరు 17 వేడుకలపై క్యాబినెట్‌లో ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. స్వాతంత్ర్య ఉత్సవాలను 15 రోజుల పాటు నిర్వహించినట్లుగానే ఈ వేడుకలను కూడా వారం పాటు నిర్వహించే అవకాశం ఉన్నది. 

Also Read : కేంద్రం బిగ్ స్కెచ్.. ఆ నిర్ణయంతో కేసీఆర్ కు షాక్

Also Read : KTR ఇలాఖాలో TRSకు షాక్.. ఈటల రాయబారంతో బీజేపీలోకి ముఖ్య నేత 

Tags:    

Similar News