మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : రామగుండం ఎమ్మెల్యే

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని,

Update: 2024-09-25 11:05 GMT

దిశ,గోదావరిఖని టౌన్: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు కేటాయించి అనేక ప్రోత్సాహకాలు ప్రవేశ పెట్టారన్నారు.

అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించిందన్నారు. కుటీర పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక మహిళలు , స్వశక్తితో మహిళలు ముందుకు వస్తే ప్రభుత్వ పథకాల ద్వారా వారు వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి సహకారం అందించడానికి పట్టణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్మా విభాగం కృషి చేస్తోందన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ , నాయకులు పాత పల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాష్, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఇ ఇ రామన్, డి ఇ లు జమీల్, హనుమంతు నాయక్, ఆర్ ఐ శంకర్ రావు, మెప్మా టీఎంసీ ఊర్మిళ, సీఓలు శ్వేత, స్వరూప, సీఎల్ ఆర్.పి.కవిత, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News