పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ: ఎస్సైపై తీవ్ర ఆరోపణలు

మల్యాల పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆ మహిళ బంధువులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Update: 2023-04-18 17:14 GMT

దిశ, మల్యాల: మల్యాల పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆ మహిళ బంధువులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మండల కేంద్రంలోని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళా ఆమె ఇంటి వద్ద ప్రహరీ నిర్మించుకుంటున్న సమయంలో మల్యాల ఎస్సై తొలగించారని ఆమె ఆరోపించింది.

తనకు ప్రాణభయం ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చినా.. ఎస్సై చిరంజీవి పట్టించుకోలేదని ఆమె తెలిపింది. పక్కింటి వారి నుంచి ఎస్సై లంచం తీసుకొని ప్రహరీ నిర్మాణాన్ని ఆపి హద్దు రాళ్లను తొలగించారని బాధితురాలు నిర్మల ఆరోపించింది. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ పరిస్థితిపై స్పందించాలని ఎస్సైని కోరగా.. దిక్కున్న చోట చెప్పుకోమన్నాడని.. అందుకే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

ఎస్సైపై విమర్శలు గుప్పిస్తూ.. ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్యాల మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా.. కొన్ని నెలల క్రితం బల్వంతపూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రవీందర్ రెడ్డి కూడా ఇదే మల్యాల ఎస్సై తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిర్మలకు నేర చరిత్ర ఉంది.. ఎస్సై చిరంజీవి

పంజాల నిర్మల మ్యాడంపల్లి గ్రామంలోని మహిళ సంఘాల బుక్ కీపర్ గా పనిచేస్తూ కొంత మందిని వెనకేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని, మ్యాడంపల్లి గ్రామంలోని క్వారీ యజమానులను డబ్బులు డిమాండ్ చేస్తూ, వాళ్ళు ఇవ్వకపోతే క్వారీలో ఉన్న డీజిల్ తో అక్కడ యంత్రాలను తగబెట్టిందని ఎస్సై తెలిపారు. రౌతు గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాల నిర్మల, రౌతు గాయత్రికి చెందిన ఇంటి దారి విషయంలో ఆమెతో గొడవ పడేదని తెలిపారు. ఆమె ఇంటికి వెళ్లే నాలుగు గజాల దారిలో రాళ్లు వేసి వారిని వెళ్లనివ్వకుండా చేసిందని తెలపారు.

అదేంటని అడిగితే గాయత్రి ఇంటి ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి చంపుతామని బెదించినందున కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్థుల సమక్షంలో దారిలో ఉన్న రాళ్లను తీయగా నిర్మల పోలీసులే రాళ్లను తొలగించారని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగినట్లుగా నటించగా, వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించామని వీటిని మనసులో పెట్టుకొని తనపై విమర్శలు చేశారని మల్యాల పోలీస్ స్టేషన్ ఎస్సై మంద చిరంజీవి తెలిపారు.

Tags:    

Similar News