డూప్లికేటు డాక్టర్లపై కొరడా.. అనుమతులు లేని క్లినిక్‌ల సీజ్

శంకర్ దాదా ఎంబీబీఎస్‌లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Update: 2024-10-01 02:01 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్: శంకర్ దాదా ఎంబీబీఎస్‌లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆసుపత్రులను తెరిచి ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టింది. అనుమతులు లేని క్లినిక్‌లను సైతం సీజ్ చేస్తుంది. హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 80 వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో ఒక పడక నుంచి 30 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు కూడా ఉన్నాయి. మరో 30 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఆస్పత్రులను నడుపుతున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. ఆసుపత్రుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఇందుకోసం వైద్య శాఖ కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో గ్రామాల్లో సైతం తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద అనుమతులు తీసుకుని ఆసుపత్రులను నిర్వహించాలి. అదేవిధంగా బెడ్ల సామర్థ్యం, వైద్య సేవలు, పరీక్షలకు తీసుకుంటున్న చార్జీల వివరాలను తెలుగులో బోర్డుపై ప్రదర్శించాలి. ఆసుపత్రిలో ఏ వైద్యుడు వైద్యం నిర్వహిస్తున్నారనేది బోర్డుపై ఉండాలి. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇవేవీ కనిపించవు. ఈ తనిఖీల్లో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి.

తనిఖీల్లో నిజాలు వెలుగులోకి

ఎంబీబీఎస్ చదివిన వారే ఆసుపత్రి ఏర్పాటు చేసుకుని వైద్యం చేయాలి. కానీ ఆయుష్, యునాని చదివిన వారు కూడా అల్లోపతి ఆసుపత్రులు తెరిచి వైద్యం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో వెల్లడైంది. ల్యాబ్ స్కానింగ్ సెంటర్లు కూడా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తేలింది. బోర్డుపై ఉండే వైద్యుడు లోపల పరీక్షలు చేసే వైద్యుడు వేరుగా ఉంటున్నారు. కొందరు అనుమతి లేని వారు కూడా ఆసుపత్రులను నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో కనీస నిబంధనలు పాటించడం లేదు. చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు లేవు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవడం లేదు. ఆసుపత్రి నుంచి వచ్చే బయో వేస్టేజ్‌ను ఇష్టానుసారంగా పారవేస్తుండడంతో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది.

ముగ్గురిపై కేసు నమోదు

హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను వైద్యశాఖ అధికారులు సీజ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మికుంట పట్టణంలోని నకిలీ వైద్యులు సదానందం, శ్రీరాములు గౌడ్ వద్ద కూడా పెద్ద మొత్తంలో నొప్పి నివారణ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, హైడోస్ యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు, గుర్తించి వాటిని స్వాధీనం చేసుకేని వీరిపై కూడా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.

నిరంతర తనిఖీలు

ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కొన్ని ఆస్పత్రులను తనిఖీ చేసాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఆసుపత్రులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యులు కారు. వైద్యం చేసే ఎటువంటి చట్టబద్ధత, ప్రభుత్వ అనుమతి వారికి లేదు. ప్రజలు వారి వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. మీ దగ్గరలోని క్వాలిఫైడ్ వైద్యుల వద్దకు వెళ్లి నాణ్యమైన వైద్యం పొందాలి.

- డాక్టర్ పి.గౌతమ్, హెచ్‌ఆర్‌డీఏ జిల్లా కార్యదర్శి 


Similar News