రైతన్నకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా : వేములవాడ ఎమ్మెల్యే

రైతన్నకు బాసటగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

Update: 2024-09-30 10:18 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రైతన్నకు బాసటగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కొనరావుపేట, కొలనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు బండ నరసయ్య, సంకినేని రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ భూసార పరీక్షలు నిర్వహించి, వాటికి అనుగుణంగా రైతులు వంగడాలను అందించాలని, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే నాథుడే లేడని, ప్రజా ప్రభుత్వం లో నష్టపోయిన రైతులకు పంట బీమా ద్వారా పరిహారం అందిస్తున్నామన్నారు.

వడ్ల కొనుగోలు సమయాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందని, రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సహకార సంఘాలు వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోటీపడుతూ రుణాలు మంజూరు చేస్తున్నాయని, సహకార సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులు పండించిన పంటలను సగర్వంగా అమ్ముకునేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించారని మహిళలకు ఐకేపీ సెంటర్లు, రైతులకు ఉపయోగపడేలా జలయజ్ఞంతో సాగునీరు అందించారని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులందరికీ విడతల వారీగా ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు.

మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారన్నారు. ప్రతి ఏటా 20 వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధి పెంపొందించే కార్యక్రమాలు చేపడుతూ మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకు పోతున్నారని తెలిపారు. గతంలో మహిళలను లక్ష అధికారులు చేయడం లక్ష్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పావలా వడ్డీకి రుణాలు మంజూరు, తదుపరి వడ్డీలేని రుణాలను మంజూరు చేశారని గుర్తుచేశారు. జిల్లాలో మహిళలకు 600 కోట్ల బ్యాంకు రుణాలుఇప్పిస్తున్నామని, మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


Similar News