వాహ్ క్యా సీన్ హై.. ఒకే వేదికపై ఆ ఇద్దరూ!

Update: 2023-03-31 16:13 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఇటు తాజా చైర్మన్, అటు మాజీ చైర్ పర్సన్ మధ్యలో ఎమ్మెల్యే అసలు ఊహించని ఈ ముగ్గురు నాయకులు ఒకే స్టేజి పంచుకోవడం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో కొనసాగినప్పటికీ ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న నాయకులు కాస్తా అనూహ్యంగా ఒకే స్టేజిపై పక్క పక్కనే కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.

గాన కోకిల కళానికేతన్ 31 వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక అంగడి బజార్ వద్ద నిర్వహించిన నృత్య పోటీల కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. బోగ శ్రావణి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పలు ఆరోపణలు చేస్తూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రావణి బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సంజయ్ కుమార్ ఓటమికి కారణం అవుతానంటూ శ్రావణి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

ఆమె రాజీనామా తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ కు ఇన్ చార్జి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇలా పార్టీకి దూరమైన మాజీ చైర్ పర్సన్ శ్రావణి అనూహ్యంగా ఇలా ఓ కార్యక్రమలో ఎమ్మెల్యేతో పాటు గోలి శ్రీనివాస్ తో ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తిగా మారింది. అయితే కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రావణి పేరు ఉచ్చరించడం కొస మెరుపు. కాసేపటికి ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో హడావిడిగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News