అక్రమాలకు అడ్డాగా వారధి సొసైటీ

Update: 2024-08-09 09:20 GMT

దిశ బ్యూరో, కరీంనగర్ : నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసిన వారధి సోసైటీ నిర్వాహకులకు ఉపాధి అస్త్రంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సొసైటీ నేటికి తన అక్రమ వ్యవహారాన్ని సాగిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఏజెన్సీలు నిరుద్యోగులనుంచి చేసే ఆర్థిక దోపిడీ అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో అప్పటి కలెక్టర్ నీతుప్రసాద్ కరీంనగర్ జిల్లాలో వారధి సొసైటీని ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందుకు ఓ రిటైర్డు ఉద్యోగిని నియమించి ఆ బాధ్యతలను అప్పగించింది. అయితే ప్రారంభంలో సాఫీగా సాగినప్పటికీ కాలక్రమేణా వారధి సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ నియమకాల్లో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సొసైటీని పారదర్శకంగా నడిపిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నప్పటికీ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. అక్రమ మార్గంలో నియామక ప్రక్రియ నడిపిస్తున్నారని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించే సందర్బంలో కనీస అర్హతలను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్ పద్ధతిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనుయాయులకు అవకాశం కల్పిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రారంభంలో పారదర్శకత పాటించినప్పటికీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల్లో శాశ్వత ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి అవుట్ సోర్సింగ్ నిదానానికే ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో వారధి సొసైటీకి డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న గత పాలకులు అక్రమ సంపాదనకు వేదికగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ను కేసీఆర్ సర్క్యూట్ రెస్ట్ హౌజ్‌గా మార్చి దాని నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించారు. కాగా, దాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పాలకవర్గ సభ్యులు వారధి నుంచి అవుట్ సోర్సింగ్ నియామకం పేరుతో నిరుద్యోగులనుంచి రూ.లక్షలు వసూలు చేసి నియమించారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం వివాదాస్పదంగా మారింది. దీంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాని పేరు మార్చి ఆర్ అండ్ బీ అథితి గృహంగా మార్చి నిర్వహణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖ అధికారులకు అప్పగించారు. అయితే అవినీతికి పాల్పడిన నేతలు వారధిని అడ్డంగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడడంతో ఆ సొసైటీ వివాదాల్లో చిక్కుకుంది.

సుడా నియామకాల్లో సైతం అవకతవకలు...

వారధి సొసైటీ ద్వారా సుడాలో కొంతమంది నిరుద్యోగులను డబ్బులు తీసుకుని నియమించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎంతమందిని తీసుకున్నారు? వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? అనేది గోప్యంగా ఉంచి వారిపేరున సుడా పాలకవర్గంలో క్రియాశీలపాత్ర పోషించే వారు వారిపేరున జీతాలు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై ఇప్పటివరకు సుడా పాలకవర్గం కానీ, వారధి సొసైటీ నిర్వాహకులు కాని ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

ప్రధాన నాయకుల కనుసన్నల్లో నియమకాలు...

వారధి సొసైటీ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ నియామకాలను సదుద్దేశంతో చేపట్టినప్పటికీ పాలకులు వారిచేతివాటం ప్రదర్శించడంతో అక్రమాలకు దారులు పడ్డాయి. అయితే ప్రభుత్వంలో పలుకుబడి ఉండడం అధికారులు జీహుజూర్ అనడంతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకుని నియమకాలు చేసినట్టు అప్పట్లో నిరుద్యోగులు బాహాటంగానే విమర్శించారు. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు సైతం వారికి తోడై దందాను సాగించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే నేటికీ అక్కడ గతపాలకుల కనుసన్నల్లోనే నియామక ప్రక్రియ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ అన్ని శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత పాలకుల అనుచరులే ఉండడంతో ప్రభుత్వంలో జరిగే ప్రతిచర్య గత పాలకులకు సమాచారం చేరుతుందని జనం బాహాటంగా చర్చించుకుంటున్నారు.

పారదర్శకంగా ఉంటే గోప్యత ఎందుకు

అడ్వకేట్ ఏవీ రమణ

ఉద్యోగనియమకాల్లో పారదర్శకత పాటిస్తుంటే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎందుకు ఇవ్వడం లేదు. కలెక్టర్ చైర్మన్‌గా కొనసాగుతున్నప్పటికీ వాళ్ల కళ్లు కప్పి నిర్వాహకులు అవినీతికి పాల్పడుతున్నారు. నియామకాల్లో నిబంధనలు పాటించడం లేదు. కనీస విద్యా అర్హతలను ప్రామాణికంలోకి తీసుకోవడం లేదు. రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడంలేదు. ఏజెంట్లు అనుయాయుల ద్వారా నిరుద్యోగులనుంచి రూ.లక్షలు వసూల్ చేస్తు అక్రమాలకు పాల్పడుతున్నారు. సర్వీస్ చార్జి పేరు మీద రూ.లక్షలు తీసుకుని నిరుద్యోగుల పేరుమీద నిర్వాహకులు ఉపాధి పొందుతున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి వారధిలో అక్రమాలను అరికట్టాలి. లేదంటే లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం.

కలెక్టర్ ఆదేశానుసారమే నడిపిస్తున్నాం

వారధి సొసైటీని పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా నడిపిస్తున్నాం. ఉద్యోగనియమకాలు అన్ని నిబంధనల ప్రకారం సాగిస్తున్నాం. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం సొసైటీ నిర్వహణ ఖర్చులు పోను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. కొంతమంది కావాలనే సొసైటీపై బురద చల్లుతున్నారు. ఎలాంటి విచారణకైనా మేము సిద్దం. సొంతంగా నిర్ణయం తీసుకుని నియామకం చేపట్టే అవకాశం నాకు లేదు. కమిటీ ఉంటుంది కమిటీ నిర్ణయం మేరకే నియామకం చేపడుతాం. నిర్వహణ ఖర్చులు, సర్వీస్ చార్జీలు, ఖర్చులు ప్రతిది ఆడిటింగ్ ఉంటుంది. ఎక్కడ అక్రమం జరిగే అవకాశం లేదు.

- ఆంజనేయులు, వారధి సొసైటీ నిర్వాహకులు

Tags:    

Similar News