పోలీస్ స్టేషన్‌లోనే టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల బాహాబాహీ.. తీవ్ర ఉద్రిక్తత
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు బాహాబాహీకి దిగారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా దాడులు చేసుకోవడం గమనార్హం. మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టగా.. దీనికి కౌంటర్ గా బీజేపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలోఘాటుగా స్పందించారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు సదరు బీజేపీ కార్యకర్త ఇంటిపైకి దాడి చేసేందుకు వచ్చారని, ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు సుమారు వంద మంది అక్కడకు చేరుకుని బీజేపీ కార్యకర్తపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయం తెలుసకున్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులు కూడా హుటాహుటిన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య యుద్దం జరిగింది. తనపై తీవ్రంగా దాడి చేశారని, శరీరం అంతా పిడిగుద్దులు గుద్దారంటూ బీజేపీ కార్యకర్త ఆరోపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దాడుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య కూడా పాల్గొన్నాడంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తీవ్ర గాయాలపాలైన యువకులను హాస్పిటల్ తరలించారు. అయితే దాడిలో గాయపడ్డ వారు పోలీస్ స్టేషన్ లోనే పడిపోయిన వీడియోలు కూడా వైరల్ కావడం గమనార్హం. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రక్షక భట నిలయంలోనే టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య ముష్టి యుద్దం చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానం అంటే చివరకు ఠాణాలోనే కొట్లాడుకునేంత వరకు చేరుకుందా అన్న విమర్శలు వస్తున్నాయి. కాఖీలంటేనే హడలి పోవాల్సింది పోయి వారు నిలువరిస్తున్నా వినకుండా ఏకంగా స్టేషన్ లోనే దాడులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.